పంట నిషేధంపై రైతు మంట
ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో నెమ్మదిగా ఆంక్షల కత్తిని ఝుళిపిస్తోంది. అయోమయంలో ఉన్న రైతన్నలను మరింత కుంగదీస్తోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో రెండో పంటసాగు చేయడానికి వీల్లేదని ప్రకటించడం అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే రెండో పంట సాగు కోసం చేసిన ఖర్చు వృథా అవుతుందని వరి, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాడేపల్లి రూరల్ : రైతులను బెదిరించి, వారికి జీవనధారమైన పంట పొలాలను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే ప్రజల తరఫున న్యాయపోరాటం చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెనుమాకలో బుధవారం రైతులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదలై ఇన్ని రోజులైనా 57 వేల ఎకరాలకు అధికారులు ఏడువేల ఎకరాలు మాత్రమే సమీకరించగలిగారు. మంగళగిరి ప్రాంతంలో 16,500 ఎకరాలకు కేవలం 410 మంది రైతులు 734 ఎకరాలను ఇచ్చారన్నారు. ప్రజా వ్యతిరేకతతో జరుగుతున్న ల్యాండ్ పూలింగ్‌పై ప్రభుత్వం బెంబేలె త్తి సీఆర్‌ఆర్ డీఏ అధికారుల ద్వారా రైతులను బెదిరింపులకు గురిచేసే ప్రకటనలు ఇప్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భూ సమీకరణ పూర్తవకుండా రైతులకు ఒప్పంద హామీ పత్రాలు ఇవ్వకుండా, మార్చి తర్వాత రాజధాని పొలాల్లో పంటలు వేయడానికి వీల్లేదని సీఆర్‌డీఏ అధికారులు ఏ విధంగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో ఇదే ప్రాంతాన్ని ఉడా పరిధిలోకి తీసుకునేందుకు అప్పటి ఉడా అధికారులు పావులు కదపగా వారి చర్యలను ఖండిస్తూ రైతులకు మద్దతు పలికిన చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలకు ప్రభుత్వం హడలెత్తి భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయలంటూ సీఆర్‌డీఏ అధికారులపై పడడంతో వారు ఈ విధంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.