మూడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్
రైతులకు దరఖాస్తులు అందజేసిన అధికారులు
మంగళగిరి రూరల్: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి గానూ మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభించినట్లు తహశీల్దార్ సీహెచ్ కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని కృష్ణాయపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఎం.ధనుంజయ, తహశీల్దార్ సత్యానందం, డిప్యూటీ తహశీల్దార్ శోభన్‌బాబు, కె.శ్రీనివాసరావులు రైతులకు భూ సమీకరణ దరఖాస్తులను అందజేశారు.
భూ సమీకరణపై అభ్యంతరాలను ఈనెల 19వ తేదీన పంచాయితీ కార్యాలయంలో జరిగే గ్రామసభ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అదే విధంగా మండలంలోని నీరుకొండ గ్రామ పంచాయితీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఎం.దాసు, తహశీల్దార్ ఈశ్వరయ్య, డిప్యూటీ తహశీల్దార్లు చంద్రశేఖర్, దైవాదీనంలు రైతులకు భూ సమీకరణ దరఖాస్తులను అందజేశారు. కురగల్లులో డిప్యూటీ కలెక్టర్ టి.వరభూషణరావు, తహశీల్దార్ డి.చంద్రశేఖరరావు, డిప్యూటీ తహశీల్దార్లు వి.నాగేశ్వరరావు, ఎం.బాల నరసింహారావులు భూ సమీకరణ దరఖాస్తులను రైతులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వీర్వోలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
తూళ్లురులో కొనసాగుతున్న ల్యాండ్‌పూలింగ్
రాయపూడి(తుళ్ళూరు): తుళ్ళూరు మండలంలో బుధవారం జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో మొత్తం 326.94 ఎకరాల, 188 మంది రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. గ్రామాల వారీగా వివరాలు ఇలా వున్నాయి. అబ్బురాజుపాలెంలో 8 మంది రైతులు 8.42 ఎకరాలు, బోరుపాలెంలో ముగ్గురు రైతులు 1.09 ఎకరాలు, నేలపాడులో 21 మంది రైతులు 44.42ఎకరాలు, దొండపాడులో 4 మంది రైతులు 4.27ఎకరాలు,
పిచుకులపాలెంలో 5 మంది 4.29ఎకరాలు, కొండమరాజుపాలెంలో 5 రైతులు 7.64 ఎకరాలు, అనంతవరంలో 28 మంది 80.10 ఎకరాలు, నెక్కల్లులో 4 మంది 14 ఎకరాలు, శాఖమూరులో 36మంది 47.68 ఎకరాలు మందడం -2 లో 2 మంది రైతులు 2.13 ఎకరాలు,వెలగపూడిలో 16 మంది 26 .65ఎకరాలు, ఐనవోలు లో 19 మంది రైతులు 22 ఎకరాలు, తుళ్లూరు-1లో 20 మంది రైతులు 33.32 ఎకరాలు, తుళ్లూరు-2 లో 16 మంది , 30.93 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలను డిప్యూటీ కలెక్టర్‌లకు అందజేసి రసీదులు పొందారు. దీంతో ఇప్పటి వరకు తుళ్లూరు మండలంలో జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో అంగీకార పత్రాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మండలంలో ఇంకా పూలింగ్ ప్రారంభం కాని పలు గ్రామాల్లో గురువారం మున్సిపల్ మంత్రి నారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎంపీపీ పద్మలత తెలిపారు.