బాబుగారి భూదాహం
ఎయిర్‌పోర్టుల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్ను
భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు 6,500ఎకరాలు చాలన్న
అధికారులు.. అదీ ఎక్కువేనన్న నిపుణులు
15 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం
రైతుల పొట్టకొట్టి బడా సంస్థలకు..
హైదరాబాద్: రాజధాని పేరుతో, భూసమీకరణ ముసుగులో 35 వేల ఎకరాల పచ్చని పంటభూములను గుంజుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్నేసింది. పచ్చని పంటలు పండే వేల ఎకరాల భూములను సిమెంట్ కాంక్రీటుగా మార్చేయడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో ఏకంగా 15 వేల ఎకరాలు, ఏడు మినీ విమానాశ్రయాల పేరుతో మరో ఏడు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు ఇటీవల పర్యటించిన జపాన్‌లోని హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం 1,800 ఎకరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1,850 ఎకరాల్లోనే నిర్మించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కూడా 6,500 ఎకరాలు సరిపోతుందని అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ఈ భూమి కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం 15 వేల ఎకరాలు సేకరించడం ఎవరికి మేలు చేసేందుకన్నది అర్థం కావడంలేదు. భోగాపురంలో తొలి దశ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ.3000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. స్థల క్లియరెన్స్‌కు ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా చేశారు. ఇందుకోసం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కంపెనీ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పీపీపీ విధానంలో విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 6,500 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సరిపోతున్నా 15 వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు నాయుడు సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థ జేబులు నింపే ఎత్తుగడ ఉందనే అనుమానాన్ని అధికార వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భూములను అప్పగించడానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భోగాపురంలో అర ఎకరం, ఎకరం, రెండేసి ఎకరాల చిన్న, సన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారని, అలాంటి రైతుల పొట్టకొట్టడం అన్యాయమని అధికారులు పేర్కొంటున్నారు.
అన్నీ పీపీపీలే!
రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానంపైనే ఆధారపడుతుంది. ఇఛ్చాపురం నుంచి తడ వరకు చేపట్టనున్న బీచ్ కారిడార్‌కు బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బూట్) విధానాన్ని అవలంబించనుంది. దీనివల్ల ప్రయాణికులపై భారీగా టోల్ భారం పడుతుంది.
ఇఛ్చాపురం నుంచి తడ వరకు 1000 కిలో మీటర్ల మేర బీచ్ కారిడార్ నిర్మాణం. ఇఛ్చాపురం-విశాఖపట్నం, విశాఖపట్నం-నర్సాపురం, నర్సాపురం-ఒంగోలు, ఒంగోలు-తడ వరకు నాలుగు ప్యాకేజీలు.
M>-Mుళం జిల్లా బావనపాడులో 4000 ఎకరాల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో పోర్టు ఏర్పాటు.
విశాఖపట్టణం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటు. ఒక్కో స్కూలుకు రూ.65 కోట్ల వ్యయం, 20 ఎకరాల స్థలం.
తిరుపతి, విశాఖపట్టణాల్లో రూ.400 కోట్ల వ్యయంతో మెగా కన్వెన్షన్ కేంద్రాల నిర్మాణం. ఒక్కో కేంద్రానికి 60 ఎకరాలు చొప్పున స్థలం.
విజయవాడలో 30 ఎకరాల స్థలంలో రూ.110 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ కేంద్రం.
విశాఖ, తిరుపతిలో ఐదు నక్షత్రాల హోటళ్లు. విజయవాడలో మూడు నక్షత్రాల హోటల్.
విశాఖపట్టణం, తిరుపతిల్లో 180 కోట్ల రూపాయల చొప్పున వ్యయంతో సమగ్ర క్రీడా కాంప్లెక్స్‌ల నిర్మాణం. ఒక్కో కాంప్లెక్స్‌కు 70 ఎకరాలు.
ఏడు జిల్లాల్లో విమానాశ్రయాలకు ఏడు వేల ఎకరాలు
మరోవైపు ఏడు జిల్లాల్లో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఒక్కో జిల్లాల్లో 1000 ఎకరాలు చొప్పున ఏడు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఒక్కో విమానాశ్రయ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పీపీపీ విధానంలోనే ఈ విమానాశ్రయాలను నిర్మిస్తారు. నెల్లూరు జిల్లా దగ్గదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, చిత్తూరు జిల్లా కుప్పం, ప్రకాశం జిల్లా ఒంగోలు, దొనకొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో ఈ విమానాశ్రయాలను నిర్మించనున్నారు.