ఆత్మహత్యలే గతి..! | Notification of the land of the equation | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలే గతి..!

Published Sat, Jan 31 2015 1:22 AM | Last Updated on Tue, Oct 9 2018 5:07 PM

ఆత్మహత్యలే గతి..! - Sakshi

ఆత్మహత్యలే గతి..!

నులకపేట, డోలాస్‌నగర్ వాసుల ఆందోళన
భూసమీకరణ నోటిఫికేషన్‌లో తమ నివాస స్థలాలు ఉన్నాయని ఆవేదన
మంగళగిరి ఎమ్మెల్యే  ఎదుట కంటతడి
పేదల ఇళ్ల జోలికివస్తే ఊరుకోబోమని ఆర్కే హెచ్చరిక

 
తాడేపల్లి (గుంటూరు) : రాజధాని భూ సమీకరణ ప్రక్రియ వారికి నిలువనీడ లేకుండా చేస్తోంది. వారి బతుకులను ప్రశ్నార్థకం మార్చింది. ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో కూడా తెలియని వారంతా తమకు మూకుమ్మడి ఆత్మహత్యలే గతి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులు, కూలీలకు అండగా నిలుస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)కి తమకు ఎదురైన కష్టాన్ని వివరించి కంటతడి పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..  తాడేపల్లి రూరల్ మండలం నులకపేట డోలాస్‌నగర్‌లో దాదాపు 1200 గృహాలు ఉన్నాయి. వీటిల్లో  రెండువేల కుటుంబాలు ఏళ్ల తరబడి నివసిస్తున్నాయి. రాజధాని భూసమీకరణ పరిధిలో వారి నివాస స్థలాలు ఉండడమే ఆయా కుటుంబాల ఆవేదనకు కారణమైంది. ఉన్నపళంగా ఇల్లు వదిలి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.

 ఈ నేపథ్యంలో  శుక్రవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని నులకపేటకు ఆహ్వానించి తమ కష్టాన్ని తెలియజేశారు. భూసమీకరణలో తమ నివాస స్థలాలను లాగేసుకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటివరకు తమ భూములు భూసమీకరణలో ఉన్నట్టు కూడా తెలియదన్నారు. అభ్యంతరాలు తెలిపే ప్రక్రియపై ఏ అధికారీ తమకు అవగాహన కల్పించలేదని వాపోయారు.

ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

రాజధాని నిర్మాణం కోసం పేదల ఇళ్లజోలికి వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్న డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల వాసుల ఇళ్ల తొలగింపునకు మూడవ కంటికి తెలియకుండా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఈ సర్వే నంబర్లు కూడా ఉన్నాయన్నారు.
 ఈ విషయాలను అధికారులు తెలియజేయకుండా ఆఫీసుల్లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, నివాస గృహాల జోలికి రానన్న ప్రభుత్వం ఈ సర్వే నంబర్లను ల్యాండ్ పూలింగ్‌లో ఎందుకు కలిపిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని నివాసప్రాంతాల వారి వద్దకు వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తోందన్నారు.

రాజధానికి తమ భూమి ఇస్తే, దానికి అనుగుణంగా దరఖాస్తులు ఇవ్వనటువంటి వారి నుంచి 9.2 ఫారాలను పూరించి అధికారులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ, మండల కన్వీనర్లు భీమిరెడ్డి సాంబిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement