‘రాజధాని’లో గ్రామ కంఠాలపై రానున్న స్పష్టత
రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్న అధికారులు
గుంటూరు: రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలపై అధికార యంత్రాంగం రెండు మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనుంది. కొంతకాలంగా గ్రామ కంఠాలపై స్పష్టత లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో కనీసం ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండదేమోననే భయం వారిని వెంటాడింది. తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన కాంపిటెంట్ అథార్టీ, డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షించారు. గ్రామ కంఠాలపై సీఆర్‌డీఏ రూపొందించిన విధివిధానాల ఆధారంగా అధికారులు సరిహద్దులు నిర్ణయించారు. వీటిని ఆధారంగా చేసుకుని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ కమిషనర్‌కు వివరాలు అందజేశారు.
‘సమీకరణ’ నుంచి మినహాయింపు
రాజధానిలోని 29 గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో గ్రామ కంఠాలు విస్తరించి ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు మూడు ఎకరాల్లో, మరి కొన్ని గ్రామాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ వ్యవసాయ పనులకు ఉపయోగించే షెడ్‌లు, గడ్డివాముల ఏర్పాటుకు కేటాయించిన స్థలాలు, పొగాకు బ్యారెన్లు తదితర నిర్మాణాలను భూ సమీకరణ నుంచి మినహాయించారు. ఈ స్థలాలను రైతులు భవిష్యత్తులో తమకు అనుకూలంగా వినియోగించుకునే అవకాశం లభించనున్నది. గ్రామ కంఠం పరిధిలో లేఅవుట్లు ఉంటే వాటికీ మినహాయింపునిచ్చారు. ఆ లేఅవుట్లలో నిర్మాణాలు జరుపుకొనే అవకాశం లభించనుంది.
ఆ తేదీకి ముందు నిర్మాణాలకూ మినహాయింపు..
డిసెంబర్ ఎనిమిదో తేదీ -2014కి ముందు స్థలాల్లో ఉన్న నిర్మాణాలకూ మినహాయింపు ఇచ్చారు. ఆ తరువాత నిర్మాణం జరిగిన స్థలాలకూ భూ సమీకరణ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. గ్రామ కంఠాలపై వచ్చిన 7700 దరఖాస్తులను అధికారులు పరిశీలించి నివేదికను కమిషనర్‌కు అందించారు. వీటిపై ఒకటి రెండ్రోజుల్లో కమిషనర్ నిర్ణయం తీసుకుని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
మరో 3 రోజులు
Published Tue, Dec 15 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement