పోలీస్ నిఘా నేత్రాలు
ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా.. ఇప్పుడు భద్రత ప్రమాణాల్లో జాతీయస్థాయిలో నాలుగోస్థానంలో నిలిచింది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో చీమ కుట్టినా తెలిసిపోతోంది. ఇప్పటికే 3500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మరో 50వేల కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా పోలీస్‌శాఖ ముందుకెళ్తోంది. దీనికి సీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
కరీంనగర్ క్రైం: గతంలో పోలీస్‌స్టేషన్ అంటే భయపడే స్థాయి నుంచి ప్రజలు వచ్చి ఫిర్యాదు చేసేందుకు కావాల్సిన వాతావరణం కల్పించారు జిల్లా పోలీస్ అధికారులు. స్టేషన్ అధికారుల కోసం ఎదురు చూడకుండా.. అధికారి ఉన్నా.. లేకపోయినా.. ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పాటు చేశారు. బాధితులు కూర్చునేందుకు కార్పొరేట్ స్థాయిలో మోడల్ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర రాజధానికే పరిమితమైన కార్డెన్‌సెర్చ్‌లను కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అమలు చేసి మంచి ఫలితాలను రాబట్టారు సీపీ కమలాసన్‌రెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్‌డ్రైవ్‌తో చెక్ పెట్టారు. నేరాల నియంత్రణ, చేధనతో పాటు అధిక భద్రత కల్పించే సీసీ కెమెరాలపై దృష్టి సారించి వాటిని ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజి కలిగిన వాటిని ఏర్పాటు చేయడంతోపాటు వాటి కోసం కమాండ్ కంట్రోల్ చేశారు. దీనిలో ప్రజలకు అవగాహన కల్పించి వారిని కూడా భాగస్వాములను చేయడంతో కమినరేట్వ్యాప్తంగా 3500 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి.
కార్డెన్ అండ్ సెర్చ్
కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీబీ.కమలాసన్‌రెడ్డి మొదట నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. కార్డెన్‌సెర్చ్ నిర్వహించడం ద్వారా నేరస్తులకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల్లో భద్రతపై నమ్మకం పెంచారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 100కు పైగా కార్డెన్‌సెర్చ్‌లు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించి వాటిని సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. వారిని నిత్యం గమనించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. నేరం జరిగిన ఐదు నిమిషాల్లో చేరుకునేలా బ్లూకోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు పెట్టికేసు నమోదు చేసేలా ఆధునిక ట్యాబ్‌లు సమకూర్చారు. అర్ధరాత్రి తర్వాత రోడ్లపై తిరిగే వారిని నియంత్రించడానికి ఆపరేషన్ నైట్సేఫ్టీ పేరిట తనిఖీలు నిర్వహించి.. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లు
రాష్ట్ర రాజధాని తర్వాత అత్యధికంగా డ్రంకెన్‌డ్రైవ్ కేసులు కరీంనగర్‌లోని నమోదు అయ్యాయి. వారవారం క్రమం తప్పకుంగా ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్‌లు నిర్వహిస్తుండడంతో మందుబాబుల గుండెల్లో గుబులు పుట్టిన్నారు. ఇప్పటివరకు 7,195 మంది పట్టుబడ్డారు. డ్రంకెన్‌డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాణాలు తగ్గాయని మహిళలు పేర్కొంటున్నారు. 2016 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 7,195 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 1822మందికి జైలు శిక్ష విధించారు. 4,350మందికి జరిమానా, 357 మందితో శ్రమదానం చేయించారు. వీరినుంచి 1,18,34,250 జరిమానా వసూలు చేశారు. 409 మందికి ఒకరోజు శిక్ష, 763 మందికి రెండురోజులు, 245 మందికి మూడురోజులు, 122 మందికి నాలుగురోజులు, 108 మందికి ఐదు రోజులు, 56 మందికి ఆరు రోజులు, 55 మందికి ఏడు రోజులు, 44 మందికి 10 రోజులు, 15 మందికి 15 రోజుల నుంచి నెల, ముగ్గురికి రెండు నెలల 18 రోజులు, ఇద్దరికి మూడు నెలల జైలు శిక్షలు విధించారు. 2016లో 1165 మంది, 2017లో 3897 మంది, 2018లో ఇప్పటివరకు 2133 మంది మందుబాబులు పట్టుబడ్డారు, మరో 666 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు బహిరంగ మద్యపానం నిషేధం కఠినంగా అమలు చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా మూడు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో..
జిల్లాలో నేరాల నియంత్రణ, చేధన లక్ష్యంగా కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నేనుసైతం కార్యక్రమం ద్వారా కెమెరాలు బిగిస్తున్నారు. జిల్లాలోని 10 మండలాల్లో నాలుగు మండలాలు పూర్తిస్థాయిలో సీసీ నీడలోకి వెళ్లాయి. మరో 7 మండలాల్లో ఈనెల చివరివరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 3500 సీసీ కెమోరాల్లో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 250, టుటౌన్ పరిధిలో 359, త్రిటౌన్ పరిధిలో 353, కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 172, కొత్తపల్లిలో 137 సీసీ కెమెరాలు ఉండగా మిగిలినవి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.
లేక్ పోలీస్ అవుట్‌పోస్టు
మానేరు డ్యాం, ఉజ్వల, డీర్ పార్క్ సమీపంలో గతంలో పలు అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోవడంతో ఎంపీ నిధులతో లేక్ పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు పెట్రోలింగ్ చేయడంతో పాటు సందర్శకులను పెంచేందుకు ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఇంటర్ సెప్టెర్ వాహనంతోపాటు బ్లూకోల్ట్స్ బృందాలు గస్తీ తిరిగే ఏర్పాటు చేశారు.
షీటీం..
ప్రత్యేకంగా మహిళలు, విద్యార్థినులు భద్రత కోసం షీటీంను బలోపేతం చేశారు. వారికి అత్యాధునికమైన కెమెరాలు అందించి పోకిరీల భరతం పడుతున్నారు. 20 షీటీం బృందాలు సీఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 796 మందిని పోకిరీలను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్‌లు నిర్వహించి 48 వరకూ వివిధ రకాల కేసులు నమోదు చేశారు.
పీడీ యాక్ట్
2017 జనవరి 24న మొదటిసారి కమిషనరేట్ పరిధిలో పీడీ యాక్ట్ అమలు చేశారు. ఇప్పటివర కూ 42 మంది వివిధ రకాల నేరస్తులపై పీడీ యా క్ట్ అమలు చేశారు. వీరిలో ఇద్దరు రౌడీషీటర్లు, ఇద్ద రు నకిలీ నక్సలైట్లు, దృష్టి మళ్లించే నేరాలకు పాల్పడేవారు ముగ్గురు, ౖఫైనాన్స్ వ్యాపారంలో మోసం చేసినవారు ఒకరు, దోపిడి దొంగతనాలకు పాల్పడిన 34 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఎన్నో కార్యక్రమాలు
కమిషనరేట్ పరిధిలో పలు నూతన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏదైనా నేర సంఘటన జరిగిన 5 నిమిషాల్లో చెరుకునేలా బ్లూకోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో అందరికీ శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నేరస్తుల సమాచారాన్ని వెంటనే నిక్షిప్తం చేసేలా సీసీటీఎన్ఎస్ అనుసంధానం చేశారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా 25 వేల మొక్కలను నాటి చేసి వాటిని సంరక్షిస్తున్నారు. ఫిర్యాదుదారులకు వారి పిర్యాదులపై సమాచారాన్ని అందించేందుకు ప్రతి నెల 10వ తేదీన ఫీడ్‌బ్యాక్ డే నిర్వహిస్తున్నారు. ఈ ఫీడ్‌బ్యాక్ డే సమర్థవంతంగా అమలు చేయడంతో రాష్టŠల్రంలోనే ద్వితీయ స్థానం పొందింది. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ–పోలీస్ విధానం
దేశంలోనే మొదటిసారిగా ఈ–పోలీస్ విదానాన్ని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈనెల 18న సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. నిలబడి ఉన్న ఓ పోలీస్రూపం ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు ఉంటుంది. దీనిలో రహస్య కెమెరా బిగించి ఉండడం వల్ల బస్టాండ్‌లో జరిగే అసాంఘిక, అక్రమ కార్యకలాపాలు, పోకిరీ చేష్టలు, అనుమానిత వ్యక్తుల కదలికలు నిరంతరం రికార్డ్ అవుతూ ఉంటాయి. ఈ కెమెరా పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం వల్ల ప్రతి కదలికలనూ కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తుంటారు. అనుమానిత వస్తువు, వ్యక్తులు కనిపించినప్పుడు బస్టాండ్‌లో ఉండే సిబ్బందిని అలర్ట్ చేస్తారు. ప్రయాణంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఈ పోలీస్ సూచిస్తుంది.