సామాన్యుని సృష్టికర్తకు గూగుల్ నివాళి
'కామన్ మేన్' సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘనంగా నివాళి అర్పింపించింది. ఆర్కే లక్ష్మణ్ 94వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన డెస్క్ వద్ద దీక్షగా పనిచేసుకుంటున్న ఆర్కే లక్ష్మణ్, ఆయన కార్టూన్ కేరెక్టర్ 'కామన్ మేన్' లు కలిసి ఉన్న చిత్రాన్ని డూడుల్ గా రూపొందించింది.
ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితులు అయిన ఈ కామన్ మేన్ సృష్టికర్త పూర్తి పేరు రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్, ఆయన అక్టోబర్ 23, 1924లో మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కుటుంబంలోని ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరి వారు. మాల్గుడి సృష్టి కర్త ఆర్ కే నారాయణ్, లక్ష్మణ్ ఇద్దరూ సోదరులు కావడం విశేషం.
ముంబాయి నుంచి ప్రచురించే ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా లో కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఇలస్ట్రేటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు.
కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానంకల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు. ఆయన జనవరి 26న పూనేలో మరణించారు.