శ్రీకాకుళం హైవేపై 2 అడుగుల మేర నీరు
విజయనగరం : విజయనగరం జిల్లాలో హుదూద్ తుఫాను పెను ప్రభావం చూపింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వేలాది ఎకరాల్లో వరి, చెరకు, అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో సమాచార వ్యవస్థ కుప్పకూలింది.దాంతో విద్యుత్, సమాచార వ్యవస్థ స్తంభించింది. రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో నిత్యావసర వస్తువులు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. విజయనగరంలో ...శ్రీకాకుళం హైవేపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరింది.
జిల్లాలోని చాలా గ్రామాల్లో పూరిళ్లు గాలి ఉధృతికి కొట్టుకుపోయాయి. రామభద్రాపురం, బొబ్బిలి, జామి మండలాల్లో కురగాయల పంటలు నీట మునిగాయి. పూసపాటిరేగ మండలం తిప్పలవలస, చింతపల్లిలో వందల సంఖ్యలో పడవలు, వలలు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇతర ప్రాంతాలకు సరైన సహాయం అందటం లేదు. మరోవైపు తాటిపూడి రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. కాగా జిల్లావ్యాప్తంగా సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.