22వ ఏట నుంచే ‘ఎర్ర’కోటలోకి!
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీతారాం ఏచూరి తన 22వ సంవత్సరంలోనే కమ్యూనిస్టుల కోటలోకి అడుగుపెట్టారు. అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించి అనతికాలంలోనే పార్టీలో ప్రముఖుల గుర్తింపు పొందారు.
1974లో సీపీఎం అనుబంధ భారత విద్యార్థి సమాఖ్య(ఎన్ఎఫ్ఐ)లో చేరిన సీతారాం ఆ తర్వాత వెనుదిరిగి చూసిందిలేదు. ఏడాదిలోపే సీపీఎంలో చేరారు. అయితే, 1975నాటి ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలయ్యారు. దీనికి ముందు కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపారు. అనంతరం జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా, 1978లో ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా, తర్వాత ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తనదైన ముద్రవేశారు.
1985లో జరిగిన 12వ మహాసభలో సీపీఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1988లో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, 1992నాటి 14వ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2017 చివరినాటికి ఏచూరి రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది.
ఏచూరి మంచి కాలమిస్టు. దాదాపు 20 పుస్తకాలు రాశారు. ‘హిందుస్తాన్ టైమ్స్’లో పలు సమస్యలపై అనేక వ్యాసాలు రాశారు. పలు దేశాల్లో పర్యటించారు. కార్మిక వర్గ ప్రయోజనాలను రాజ్యసభలో ఎలుగెత్తి చాటడంలో తనకుతానే సాటిగా నిలిచిన ఉత్తమ కామ్రేడ్ ఏచూరి.
ఏచూరి భార్య సీమా శిస్తీ కూడా ప్రముఖ జర్నలిస్టు. ఒకప్పుడు బీబీసీ హిందీ విభాగానికి ఢిల్లీలో సంపాదకురాలైన ఆమె ప్రస్తుతం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్నారు.
పేరు : సీతారాం ఏచూరి
తల్లిదండ్రులు: ఎస్ఎస్ ఏచూరి, కల్పకం
పుట్టింది: 12.08.1952న చెన్నైలో(ఉమ్మడి రాష్ట్రం)
చదువు: ఎంఎ(ఆర్థిక శాస్త్రం), ఢిల్లీ జేఎన్‌యూ
వృత్తి: రాజకీయ, సామాజిక కార్యకర్త, ఆర్థిక వేత్త, పత్రికల్లో కాలమిస్ట్
భార్య: సీమా శిస్తీ
పిల్లలు: ఒక కూతురు, ఇద్దరు కుమారులు
ప్రస్తుత హోదా: రాజ్యసభ సభ్యుడు(బెంగాల్ నుంచి), పార్టీ ప్రధాన కార్యదర్శి
నిర్వహించిన పదవులు: రాజ్యసభ సభ్యునిగా పలు కమిటీల్లో సభ్యుడు
త్వరలో.. ఇల్లు చక్కదిద్దుతాం
‘ముందు మేము మా కాళ్లపై నిలబడాలి. పార్టీని చక్కదిద్దుకోవాలి. త్వరలో పార్టీ ప్లీనం జరగనుంది. దాన్లో పూర్తిగా చర్చించి దిద్దుబాటు ప్రక్రియను చేపడతాం.’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: ఈసారి ప్రజాతంత్ర విప్లవ నినాదమా?
ఏచూరి: ఔను. ప్రజాతంత్ర విప్లవమే!. దీనర్థం తుపాకులో, తూటాలో కాదు. సామాజిక అణచివేత, పాలకుల దుర్నీతికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఏకంచేసి తిరగబడేలా చేయడం.
సాక్షి: పొత్తులు, ఎత్తులు ఉంటాయా?
ఏచూరి: ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. అవసరమైనప్పుడు వాటిపై చర్చిస్తాం. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలసి పోరాడడమే మా ముందున్న లక్ష్యం.
సాక్షి: పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ తెలుగు వ్యక్తి ఎన్నికపై..
ఏచూరి: నేను తెలుగువాడినని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది. అయితే నేను నాయకత్వం వహిస్తున్నది జాతీయ పార్టీకి. నాకు అన్ని రాష్ట్రాలూ సమానమే. కమ్యూనిస్టులకు ప్రాంతాలు, భాషలతో నిమిత్తం ఉండదు.
సాక్షి: తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం
ఏచూరి: సీపీఎంని బలపర్చండి. వామపక్ష శక్తులను బలపర్చండి. ప్రజాతంత్ర విప్లవానికి సహకరించండని విజ్ఞప్తి చేస్తున్నా.
సంక్షోభ సమయాల్లో తెలుగువారే అండ
సీపీఎం సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారీ తెలుగు నేతే అండగా నిలుస్తున్నా రు. 1964లో పార్టీ చీలిపోయినప్పుడు సీపీఐకి చండ్ర రాజేశ్వరరావు నాయకత్వం వహిస్తే, సీపీఎంను పుచ్చలపల్లి సుందరయ్య ముందుండి నడిపించారు. ఆయా పార్టీల్లో ఈ ఇద్దరూ వేసిన తమదైన ముద్ర భవిష్యత్తరాలకు కూడా పాఠంగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి.ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు దిశానిర్దేశం చేసే పదవులు తిరిగి తెలుగువారిని వరించడం విశేషం.