Communist leader govind pansare
-
‘ఆ హత్య ప్రత్యక్షంగా చూసి భయంతో పరుగెత్తాను’
ముంబయి: కమ్యూనిస్టు ప్రముఖ నేత గోవింద్ పన్సారేను గుర్తు తెలియని దుండగులు ఎలా కాల్చి చంపారనే విషయాన్ని ఓ పద్నాలుగేళ్ల బాలుడు వివరించాడు. గత ఏడాది ఫిబ్రవరి 16న కోలాపూర్ లో మార్నింగ్ వాక్ కు తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన గోవింద్ పన్సారే దంపతులపై ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు సాయుధ దుండగులు కాల్పులు జరిపి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఈ పద్నాలుగేళ్ల బాలుడే ప్రత్యక్ష సాక్షి. అతడు పోలీసులకు ఏం చెప్పాడంటే.. ’ఒక్కసారిగా టపాసుల చప్పుడులాగా గట్టిగా వినిపించింది. ఆ సమయంలో స్కూల్ కి వెళ్తున్న నేను ఆ శబ్దం వైపు చూశాను. ఓ బైక్ పై ఉన్న వ్యక్తి ఓ పెద్దావిడపై కాల్పులు జరిపాడు. ఆమె పడిపోయింది. దాంతో అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని వేగంగా కదిలాడు. ఆ సమయంలో ఓ సైకిలిస్టును ఢీకొట్టాడు. ఆ వెంటనే తనవైపుగా వస్తున్న అజోబా(మరాఠీలో తాతయ్యను అజోబా అంటారు)పై మరో యువకుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కూడా కుప్పకూలిపోయారు. నేనప్పుడు ఆ తాతయ్య వద్దకు పరుగెట్టే ప్రయత్నం చేయగా నన్నొక పెద్దమనిషి పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు పారిపో.. పరుగెత్తు పరుగెత్తు అన్నారు. అప్పుడు నేను భయంతో స్కూల్‌కి పరుగెత్తాను. తొలుత మా టీచర్ కు ఆ తర్వాత ఇంటికి వెళ్లి అమ్మానాన్నకు చెప్పాను’అని వివరించాడు. ప్రశ్న, సమాధానం పద్ధతిలో మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు ఈ బాలుడికి పోలీసులు వేశారు. -
టోల్ ఉద్యమనేతపై దుండగుల కాల్పులు
మహారాష్ర్టలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మోటార్ సైకిల్ వచ్చిన దుండగులు ఆయన నివాసం సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. శివాజీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లి వస్తుండగా అగంతుకులు ఈ దారుణానికి దిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు. నేరస్తులను పట్టుకునేందుకు పది పోలీసు టీంలను ఏర్పాటుచేసినట్లు సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని పవార్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేరగాళ్లను విడిచిపెట్టరాదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయని, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని తొలగించాలని అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్ డిమాండ్ చేశారు. కాల్పులకు గురైన పన్సారే కోలాపూర్ ప్రాంతంలో టోల్ గేట్ వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్నిఉధృతంగా నడిపిస్తున్నారు. పన్సారే మెడ, చేతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా భార్య సౌమా పన్సారేకు ఒక బుల్లెట్ తగిలింది. వారిద్దరిని సమీపంలోని ఆస్టర్ ఆధార్ ఆస్పత్రికి తరలించారు.