నూరు వసంతాల ‘అక్టోబర్’
అక్టోబర్ విప్లవం పెట్టుబడిదారీ విధానానికి, పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఆదర్శవాద స్వప్నం కాదని రుజువు చేసింది. అందుకు ఆచరణాత్మక మార్గమైంది. ఖండఖండాలలో కార్మికవర్గ, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊపిరులూదింది. సోషలిజాన్ని ఆవిష్కరించింది. ఆ మహత్తర శ్రామికవర్గ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృత్వ ప్రతీకయైన గోర్కీ ‘అమ్మ’ వంటి అసంఖ్యాకులైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం.
నిన్నటి నెత్తుటి విజయాల జ్ఞాపకాలు, గాయాల గురుతులు, త్యాగాల ఆనవాళ్లను ఆలపిస్తూ ఆగమించే విప్లవాల అక్టోబర్ ఎప్పుడూ వినూత్నమే. నేటి కర్తవ్యాల, రేపటి మజిలీల, అంతిమ గమ్యాల నెమరువేతకు సమాయ త్తమయ్యే సందర్భమే. ఈ విప్లవాల అక్టోబర్... మహత్తర శ్రామికవర్గ అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ వత్సర సంరంభంతో వస్తోంది. నిండు గుండెలతో ఆహ్వానిద్దాం, హత్తుకుందాం, ఆవాహన చేద్దాం. 1917 నవంబర్ 7న రష్యాలో జరిగిన మొట్టమొదటి శ్రామికవర్గ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి నాంది పలికింది. రష్యన్ల పాత జూలియన్ కాలెండర్ ప్రకారం అక్టోబర్ 25 అంటే నేడు వాడుకలో ఉన్న గ్రెగెరియన్ కాలండర్ ప్రకారం నవంబర్ 7 అవుతుంది.
1917 నాటి రష్యాలో అక్టోబర్ 25న రాజధాని పెట్రోగ్రాడ్‌లో బోల్షివిక్కులు సార్వత్రిక తిరుగుబాటును జరపడం వల్ల రష్యా విప్లవానికి అక్టోబర్ విప్లవం పేరు స్థిరపడిపోయింది. పైగా చైనా విప్లవం విజయవంతమైనది కూడా అక్టోబర్ మాసంలోనే (1949 అక్టోబర్ 1). అందుకే అక్టోబర్ అంటేనే విప్లవాల మాసంగా మారింది. రష్యా అక్టోబర్ విప్లవ విజయం పెట్టుబడిదారీ విధానానికే కాదు, ఒక మనిషిని మరో మనిషిని దోచుకునే వేల ఏళ్ల పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఒక ఆదర్శవాద స్వప్నం కాదని మానవ సమాజ చారిత్ర గమ్యమనే సత్యానికి రుజువైంది. ఆ మార్గా నికి వెలుగై నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలోనూ కార్మికవర్గ ఉద్యమాలకు, సోషలిజానికి, కమ్యూనిజానికి ఊపిరులూదింది. సామ్రాజ్య వాదంగా మారి పండుటాకుగా మారిన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యా మ్నాయంగా సోషలిజాన్ని నిలిపింది.
‘అమ్మ’... అక్టోబర్ విప్లవం
అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవాలు ఆరంభం కానుండగా రష్యా విప్లవంలో కీలక భూమికను నిర్వహించిన మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ గుర్తుకొస్తోంది. శ్రామికవర్గ తల్లుల విప్లవ చైతన్యానికి ప్రతీక అమ్మ. దోపిడీ, పీడనలను ధిక్కరించే చైతన్యాన్ని అందిపుచ్చుకొని, కొడుకు ఆశయసాధనలో లీనమైన ఆ అమ్మ తల్లుల త్యాగనిరతికి చిరునామా.
అక్టోబర్ మహావిప్లవానికి ముందు అత్యంత నిర్బంధం మధ్య సాహసోపేత కార్మికవర్గ పోరాటంలో కొడుకుకి తోడుగా తొలిసంతకం చేసిన అమ్మ... పావెల్ తల్లి. గోర్కీ 1906లో రాసిన ‘అమ్మ’ నవలే. కానీ ఆ అమ్మ నిన్న, నేడూ, రేపు సర్వత్రా వాస్తవమే. నాటికీ, నేటికీ విప్లవకారుల త్యాగాల బాటన నడిచే ‘అమ్మ’కు సోషలిజం, కమ్యూ నిజం, విప్లవం, రాజకీయాలు, సిద్ధాంతాలు, వైరుధ్యాలు అర్థం కాకపోవచ్చు. కానీ దోపిడీ, పీడనలకు, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా సాగే అన్ని ఉద్యమాలను వెన్నంటే ఆమె ఉంటుంది.
రష్యాలో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడ గట్టిన కొడుకు పావెల్ పోరాటంలో అమ్మ భాగం అవుతుంది. పోలీసు జులుంకు వెరవక ఎర్రజెండాను దించకుండా కార్మిక దినోత్సవ ప్రదర్శనకు అగ్రభాగాన నిలిచిన కొడుకు పావెల్‌ను వెన్నంటే ఉన్నది అమ్మే. పావెల్ చేజారిన జెండాను ఎత్తిపట్టి జనం మధ్య నిలిచి ఆ అమ్మ కార్మికులనుద్దేశించి మాట్లాడిన మాటలివి.. ‘‘నాయనలారా వినండి! మన రక్తంలో రక్తమైన పిల్లలు, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు.
మీకందరికీ, మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు. సత్యమూ, న్యాయమూగల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. జనానికందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు’’. ఉద్యమసారథియైన కొడుకు పావెల్ జైలుపాలు కాగా, అతని ఆశయాన్ని కొనసాగించేందుకు చీరలో దాచుకున్న కరపత్రాలతో నీలోవ్నా వర్గదోపిడీకి వ్యతిరేకంగా సాగుతోన్న కార్మికోద్యమానికి ప్రాణం పోస్తుంది. చివరకు పోలీసు తూటాలకు ఎదనడ్డం పెట్టి మరీ కొడుకు ఆశయాల కరపత్రాలను వెదజల్లుతూ ఆ అమ్మ అన్న మాటలు చిరస్మరణీయం.. ‘‘రక్తసముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు’’ అని. ఏ అమ్మయినా ఎప్పుడూ కొడుకు సత్యమని నమ్ముతుంది. అతడు సత్యదూరుడైతే నయానా, భయానా నచ్చజెప్పి సన్మార్గంలో పెడుతుంది. తనలో ఊపిరి ఉన్నంత వరకు బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాలడ్డుపెడుతుంది. రక్తప్రవాహాలు సైతం తన బిడ్డ నమ్మిన సత్య మార్గాన్ని ముంచెయ్యలేవని ప్రకటిస్తుంది నవల చివర్లో గోర్కీ ‘అమ్మ’.
‘ఒక తల్లి’ విప్లవ సమిధలందరి కన్న తల్లి విప్లవకారులను కన్న నిజమైన తల్లుల జీవితాలన్నీ గుండెలను పిండిచేసే మహోన్నత కావ్యాలే. బిడ్డ ప్రాణాలకు ముప్పని తెలిసీ ఎందరో బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు తన బిడ్డని త్యాగం చేసిన తల్లులెందరో. తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఉద్యమానికి ఊతమిచ్చిన అమ్మలెందరో. అందుకే ఉద్యమ నెలబాలుడు సత్యమూర్తి అంటాడు. ‘‘అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు’’ అని. చావు నన్ను సమీపించి గుసగుసలాడక ముందే, ఆంక్షల సంకెళ్ళు దాటి నిన్ను ఒక్కసారి చూడాలని వుందని చివరికోర్కెను ప్రకటిస్తాడు. మహాశ్వేతా దేవి ‘ఒక తల్లి’ పోలీసులు కాల్చి చంపిన తన బిడ్డ మరణానికి కారణాలను వెతుక్కుంటూ వెళ్లిన ఎందరో అమ్మలను జ్ఞప్తికి తెస్తుంది.
తన బిడ్డ రాసిన గోడ రాతలను తడుముకుంటూ, మరణంలో సైతం కొడుకును వీడని అతని స్నేహితుల తల్లులను వెతుక్కుని వెళ్లి, ఆ చింకిపాతల పేద తల్లులను తనివితీరా హత్తుకుంటుంది. తన బిడ్డ గడిపిన సాహసోపేత జీవిత జ్ఞాపక శకలాలను ఏరుకుని గుండెలకు అదు ముకుంటూ... తన కొడుకు కోటానుకోట్ల తల్లుల బిడ్డల ఉద్యమ శిశువని, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం విలువైన తన ప్రాణాలను త్యజించాడని అర్థం చేసుకుంటుంది. కొడుకు మార్గమే సరి యైనదిగా భావిస్తుంది. మిగిలినదంతా ఉత్త కల్పన అనుకుంటుంది. కొడుకు ఆశయాలు ఆ అమ్మకు అంతుబట్టకపోయినా కొడుకు తప్పు చేయడన్న విశ్వాసం భరోసానిస్తుంది.
అమ్మంటే తెలంగాణ పోరు పాట, ఉద్యమాల బాట
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లనెదిరించి, యూనియన్ సైన్యాన్ని ధిక్కరించి నడిపిన పోరాటంలో ఎందరో తల్లుల గుండె చెదిరే త్యాగాలున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమాతలెందరో. తమ బిడ్డలు ఎక్కడున్నారో, ఏమై పోయారో కూడా తెలియకుండా ఏళ్ళు, దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న తల్లులను కూడా ఉద్యమం మనకి అనుభవంలోకి తెచ్చింది.
ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డల ప్రాణ త్యాగాలను ప్రోత్సహించిన వారు కొందరైతే, బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు. బానిస బతుకుల విముక్తి కోసం అమ్మ ఆ రోజున అన్నీ భరించింది. కొడుకు జాడచెప్పమన్న పోలీసులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తల్లి ధీరోదాత్తత ముందు ఓటమిపాలు కాక తప్పలేదు.
తల్లుల పోరాట పటిమ ముందు అన్నీ దిగదుడుపే. దొరల పెత్తనానికీ, పోలీసుల దాష్టీకాలకూ చరమ గీతం పాడుతూ ప్రతి తల్లీ ఆనాడొక చైతన్యకెరటమయ్యింది. ఊరిదొరల ఆట కట్టించే ఉప్పెనయ్యింది. ఉద్యమానికి ఊపిరయ్యింది. చంటి బిడ్డలను వదిలేసి చంకన తుపాకులనెత్తుకున్న తల్లులెందరో. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైన ఒక్కో తల్లిదీ ఒక్కో విలక్షణమైన అనుభవం. చాకలి ఐలమ్మ మొదలుకొని ఎందరో తల్లులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం నాటి మహత్తర తెలంగాణ పోరా టంలో సమిధలుగా మారారు.
ఆ తదుపరి నక్సల్బరీ మొదలుకొని శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, గోదావరీ లోయ, కరీంనగర్ పోరాటాల నుంచి నిన్న మొన్నటి మలి తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో తల్లులు తమ బిడ్డల త్యాగాలను ప్రేమించారు. వారి ఆశయాలను అనుసరించారు. వారి లక్ష్యాలను గౌరవించారు. లాఠీలకూ, తూటాలకూ, నిర్బంధాలకూ వెరువని ఆ తల్లులే నిన్న నేడు, రేపూ కూడా విప్లవోద్యమానికి వెన్నెముక. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో దళాల్ని కాపాడుకునేందుకు బిడ్డల్ని త్యాగం చేసిన తల్లులు ఉద్యమంలోనూ, వెలుపలా కూడా ఉన్నారు. తల్లులు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు పడ్డ కష్టాలు ఒక ఎత్తై, తల్లులను జైల్లో పెట్టినప్పుడు ఆ కుటుంబాలు అనుభవించిన అంతులేని దుఃఖం మరో ఎత్తు. తమ బిడ్డల ఆచూకీ చెప్పమంటూ ఎందరో తల్లులను జైలుపాల్జేసిన బాధామయ గాధలు శ్రీకాకుళ పోరాటంలో కోకొల్లలు. తండ్రి చనిపోతే కొరివి పెట్టాల్సిన కొడుకు అడవిబాటపడితే, భర్త చితికి నిప్పుపెట్టిన విప్లవ మాతృమూర్తులెందరో.
తండ్రి శవాన్ని సైతం చూడలేకపోయిన పరిస్థితి కల్పించినందుకు రహస్య జీవనంలోంచి తల్లికి బహిరంగ లేఖ రాసిన అనుభవాలూ మనకి ఎరుకే. అందుకే కవి మిత్ర అంటాడు... ‘నిను కడసారి చూడని కొడుకులం/ కన్నీళ్ళల్లో కరిగే కొవ్వొత్తులం/లోకమంతా అమ్మ రూపమే, నీ ఆకలి మా ఆర్తనాదమే.’ వీరగాథలను చనుబాలతో నూరిపోసి, విప్లవమార్గాన్ని చూపిన వీరమాతలను చరిత్ర మరచిపోదు. ‘అమ్మ’ అలుపెరుగని పోరాట గీతం, అమ్మ త్యాగానికి ప్రతీక. మహత్తర అక్టోబర్ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృ పతాకకు ప్రతీకయైన గోర్కీ అమ్మల లాంటి అసంఖ్యాకమైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. ఆ అమ్మలందరి ఆశలను నిజం చేసేందుకు అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
మా అమ్మ పోసమ్మ యాదిలో...
అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవం ప్రారంభం కానున్న సందర్భంగా
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213
- మల్లెపల్లి లక్ష్మయ్య