దొంగ లెక్కలతో బొక్కేశారు
=ఉపకార వేతనాలు స్వాహా
=పని చేయకపోయినా కూలి చెల్లింపు
=మరణించిన వారి పేరిట పింఛన్లు
=యలమంచిలి మండలంలో అక్రమాలు
=గ్రామసభల్లో నిలదీసిన ప్రజలు
ఉపకార వేతనాలు ఇవ్వకుండా... ఇచ్చేసినట్టు రాసుకున్నారు. ఉపాధి పనులకు రానివారికీ కూలి చెల్లించారు. చనిపోయిన వారి పేర్లతో పింఛన్లు తీసేసుకున్నారు. గోతుల్ని చెత్తాచెదారంతో పూడ్చేసి డబ్బు కాజేశారు. ఏ గ్రామంలో విన్నా ఇవే అక్రమాలు. ఏ గ్రామసభకెళ్లినా వెల్లడవుతున్న నిజాలు. కమ్యూనిటీ అసిస్టెంట్లు, వాలంటీర్ల అవినీతికి నిదర్శనాలు. యలమంచిలి మండలంలో ఉపాధి పనులు, ఉపకార వేతనాల పంపిణీలో అక్రమాలపై గురువారం జరిగిన గ్రామసభల్లో గ్రామస్తులు తీవ్రంగా మం డిపడ్డారు.
యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్ : కొక్కిరాపల్లి, సోమలింగపాలెం, ఏటికొప్పాక, లైనుకొత్తూరు తదితర గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. కొక్కిరాపల్లి గ్రామంలో 15 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించినట్లు గ్రామసభల్లో వెల్లడించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనిటీ అసిస్టెంట్ (సీఏ) సరస్వతి, కమ్యూనిటీ వాలంటీర్ (సీవీ) గోపి బుజ్జిపై విరుచుకుపడ్డారు.
గ్రామానికి చెందిన విద్యార్థులు కె.భాస్కరరావు, టి.దుర్గాభవానీలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనం ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు.
కె.బేబీసాయికి ఇంటర్ మొదటి సంవత్సరంలో రూ.1200కు రూ.1000 ఇచ్చారని, రెండో సంవత్సరంలో ఉపకార వేతనం ఇవ్వకుండా దొంగ సంతకం చేసి డబ్బు కాజేశారు.
మరో విద్యార్థిని గండిబోయిన జ్యోతికి 10వ తరగతిలో రూ.1200 ఇచ్చి రూ.600 తిరిగి తీసుకున్నారని, ఇంటర్మీడియట్ మొదటి, రెండేళ్లలో ఉపకార వేతనం ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేశారు.
గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో అవకతవకలు జరిగాయి.
కమ్యూనిటీ అసిస్టెంట్ సరస్వతి 2012 సెప్టెంబర్ 5వ తేదీ వేసిన చెక్కును గురువారం ఇంటర్ విద్యార్థి సీహెచ్.రాముకు ఇచ్చారని, ఆ విషయం బయటపడుతుందన్న భయంతో గ్రామసభకు రావద్దని హెచ్చరించారన్నారు.
చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు పంపిణీ చేశారని ఆరోపించారు. లైనుకొత్తూరు గ్రామంలో 20 మంది పనికి రాకపోయిన ఉపాధి కూలీ చెల్లించారని ఉపాధి కూలీలు ఫిర్యాదు చేశారు.
లైనుకొత్తూరు వద్ద గొయ్యిని పూడ్చేందుకు రూ.1.56 లక్షలు నిధులు కాజేసి వ్యర్ధ పదార్థాలతో కప్పారన్నారు.
మర్రిబంద గ్రామంలో సామాజిక భవనం పక్కనే ఉన్న గొయ్యిని కప్పేందుకు కేవలం రూ.6 వేలు వెచ్చించి, రూ.96 వేలు కాజేశారు.
పులపర్తి గ్రామంలో ఉపాధి పనుల్లో ట్రాక్టర్ వినియోగించకుండానే నిధులు కాజేస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.
ట్రాక్టర్‌కు రూ.242 చెల్లించాల్సి ఉండగా రూ.130 ఇచ్చారని పలువురు ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదు చేశారు. గ్రామసభలు జరిగిన ఏటికొప్పాక, సోమలింగపాలెం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.