ఫైలింగ్స్లో విఫలమైన కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్లో విఫలమైన వందలాది కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ ఫైలింగ్స్కు ఆగస్టు 15 నుంచీ అక్టోబర్ 15 వరకూ రెండు నెలలు గడువునిచ్చింది. ఈ మేరకు ‘కంపెనీ లా సెటిల్మెంట్ స్కీమ్ 2014’ పేరుతో ప్రభుత్వం బుధవారం ఒక పథకాన్ని ప్రకటించింది. తమ వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్ (వార్షిక రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్స్)లో విఫలమైనవారు ఈ పథకాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.
ఆ ఆఫర్ ఉపయోగించుకునే కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలూ ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది. కార్యకలాపాలు నిర్వహించని కంపెనీలు సైతం సులభతరమైన రీతిలో ఈ విషయాన్ని ఒకే ఒక్క అప్లికేషన్, ‘తగ్గించిన’ స్వల్పస్థాయి ఫీజుతో తెలియజేసుకోవచ్చని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. జూన్ నాటికి రిజిస్టరైన కంపెనీల సంఖ్య 14.02 లక్షలు కాగా, వీటిలో దాదాపు 9.74 లక్షల వరకూ మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. దాదాపు 1.42 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా పనిచేయని కంపెనీల జాబితాలోకి వెళ్లాయి. వరుసగా మూడేళ్లు తమ వార్షిక ఫైలింగ్స్ దాఖలు చేయని కంపెనీలు ఈ కోవలోకి చేరుతాయి.