జీఎస్టీ పరిహార చట్టానికి ఓకే
ముసాయిదాకు జీఎస్టీ మండలి ఆమోదం
• వచ్చే భేటీలో మిగతా మూడు ముసాయిదా చట్టాల్ని ఆమోదిస్తాం
• బడ్జెట్ సమావేశాల్లో అన్నీ ఆమోదం పొందేలా చూస్తాం: అరుణ్ జైట్లీ
ఉదయ్‌పూర్: జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) అమలులో భాగంగా మరో ముందడుగు పడింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన పరిహార చట్టం ముసాయిదాను శనివారం జీఎస్టీ మండలి ఆమోదించింది. మిగిలిన 3 ముసాయిదా చట్టాలు వచ్చే సమావేశంలో ఆమోదం పొందేలా ప్రయ్నతిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఉదయ్‌పూర్‌లో మండలి సభ్యులతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ... ‘జీఎస్టీ అమలుతో ఏ రాష్ట్రాలైనా నష్టపోతే మొదటి ఐదేళ్లలో దానిని భర్తీ చేస్తాం. న్యాయపరమైన అన్ని చిక్కుల్ని అధ్యయనం చేశాకే పరిహార చట్టం ముసాయిదా మండలి ముందుకు వచ్చింది. మండలి ఆమోదించిన మొదటి ముసాయిదా చట్టం ఇదే. ఆమోదం కోసం కేబినెట్‌కు పంపుతాం’ అని చెప్పారు.
జూలై 1 నుంచి జీఎస్టీ అమలయ్యేలా ఐజీఎస్టీ(సమీకృత జీఎస్టీ), ఎస్జీఎస్టీ (రాష్ట్రాల జీఎస్టీ), సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ) ముసాయిదా చట్టాలకు మార్చి 4, 5 తేదీల్లో జరిగే మండలి సమావేశంలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఈ చట్టాల్ని మండలి ఆమోదించాక పార్లమెంట్లో ప్రవేశ పెడతామన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ కింద రూపొందించిన అన్ని ముసాయిదా చట్టాలు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ఆమోదం పొందుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారాల మార్పిడి, జీఎస్టీకి మారే సమయంలో ఇవ్వాల్సిన మినహాయింపులు, జీఎస్టీలో వ్యవసాయానికి నిర్వచనం వంటి అంశాలు కౌన్సిల్ ముందుకు చర్చకు వచ్చాయని తెలిపారు. జీఎస్టీ న్యాయ సంఘం ఆ అంశాలపై వివరణ కోరిందని, కౌన్సిల్ కూడా అభిప్రాయం వెలిబుచ్చిందని, వాటిని నమూనా బిల్లుల్లో పొందుపర్చాల్సి ఉందన్నారు.
ఆమోదం పొందాక పన్ను శ్లాబులపై దృష్టి
న్యాయపరంగా అన్ని అంశాల్ని పరిశీలించాక తదుపరి సమావేశంలో మిగతా నమూనా చట్టాలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు చర్చకు వస్తాయని, అవి ఆమోదం పొందేలా ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. పన్నుల తగ్గింపుతో వచ్చే లాభాల్ని వినియోగదారులకు పంచాలన్న నిబంధనను నమూనా చట్టంలో పొందుపర్చాలన్న అంశంపై తాజా సమావేశంలో చర్చించలేదని జైట్లీ వెల్లడించారు. నమూనా చట్టాలు కౌన్సిల్ ఆమోదం పొందాక పార్లమెంట్లో ప్రవేశపెడతామని, అదే సమయంలో ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందన్నారు. అనంతరం... జీఎస్టీలోని నాలుగు పన్ను శ్లాబుల్లోకి ఏ ఏ వస్తువులు ఉండాలో నిర్ణయిస్తామన్నారు. నిర్ణీత పన్ను శ్లాబులోకి ఏయే వస్తువులను చేర్చాలన్న పనిని అధికారులు చేస్తారని, ఆ వర్గీకరణ పూర్తయ్యాక మండలి ఓకే చెప్పాల్సి ఉంటుంది.