Hit and Run Motor Accidents Scheme 2022: రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్రం సరికొత్త సవరణలు చేసింది. రోడ్డు మీద నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారికి ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించేలా మార్పులు చేసింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి హిట్ అండ్ రన్ కేసులో నష్ట పరిహారాలను భారీగా పెంచింది.
పాత చట్టంలో
ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి 1989 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు తీవ్రంగా గాయపడితే నష్టపరిహారంగా రూ. 12,500 మరణిస్తే రూ. 25,000 ఇవ్వాలని ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి లీగల్ సెటిల్‌మెంట్‌లో ఈ చట్టమే అమలవుతోంది
నాలుగింతలు
పాత చట్టంలో నష్టపరిహారం చాలా చాలా తక్కువగా ఉండటంతో కేంద్రంర సవరణలకు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు రూపొందించింది. హిట్ అండ్ రన్ కేసులో తీవ్రంగా గాయపడిన బాధితులకు నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని అదే విధంగా మరణం సంభవించినట్టయితే ఈ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్న 2022 ఫిబ్రవరి 25న కేంద్రం నోటిఫై చేసింది. ఈ నిర్ణయం 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
రోడ్డు ప్రమాదాల తీరు
ప్రభుత్వం దగ్గరున్న లేటెస్ట్ వివరాల ప్రకారం 2020 ఏడాదిలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,31,714 మంది చనిపోయారు. లాక్‌డౌన్ కాలంలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఇలా ఉంటే సాధారణ సమయంలో వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇంకా పెంచాలి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంప్, రాంగ్‌సైడ్ వంటి ఉద్దేశ పూర్వక తప్పుల ద్వారా జరుగుతున్న ప్రమాదాలు.. మరణాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ తరహా కేసులకు నష్టపరిహారం మరింత భారీగా ఉండేలా మార్పులు చేస్తే బాగుండెదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం చట్ట ప్రకారం చెల్లిస్తున్న పరిహారం తక్కువంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment