సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్‌స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.
వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.
వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్‌నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్‌ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్‌ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్‌ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!
భారీ ఇష్యూల తీరిలా...
2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్‌ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్‌ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్‌ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.
మరింత స్పీడ్
డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్‌లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.
విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్‌టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.
వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్‌కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment