శిలువమ్మ కుటుంబానికి 5లక్షల పరిహారం
తిరువనంతపురం: వీధి కుక్కల దాడిలో మృతి చెందిన వృద్ధురాలి కుటుంబానికి కేరళ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అయిదు లక్షల పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటన చేసింది. గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పల్లువిల్లా గ్రామానికి చెందిన శిలువమ్మా (65)పై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
అలాగే అదే ప్రాంతంలో డైసీ(50) మరో మహిళపై కుక్కులు దాడి చేశాయి. గాయపడిన ఆమెకు ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ప్రకటించింది. వీధి కుక్కల వీరంగంతో స్పందించిన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. దీనిపై ప్రభుత్వం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వీధికుక్కల పునరుత్పత్తి నిరోధానికి ఆపరేషన్లను నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు కొల్లాంలో నిన్న కూడా నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు తమ ప్రతాపం చూపాయి. బాలుడి కండ ఊడేలా దాడి చేశాయి.