తమిళ నిర్మాత ఫిర్యాదు?! అసలేం జరిగింది?
మిల్క్ బ్యూటీ తమన్నాకు దర్శక-నిర్మాతల హీరోయిన్ అనే పేరుంది. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, సినిమా విడుదల సమయంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా బాగా సహకరిస్తారనే పేరు తమన్నాకు ఉంది. అంత మంచి పేరు తెచ్చుకున్న ఈ మిల్క్ బ్యూటీ తమిళ నిర్మాత ఆర్.కె.సురేశ్ ఆగ్రహానికి గురైందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. సురేశ్ నిర్మించిన తమిళ చిత్రం ‘ధర్మదురై’లో తమన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అంతా హ్యాపీ. కానీ, త్వరలో విడుదల కానున్న ‘అభినేత్రి’ ప్రచార కార్యక్రమాల్లో తమన్నా జోరుగా పాల్గొనడం నిర్మాత ఆర్.కె. సురేశ్‌ని ఆగ్రహానికి గురి చేసిందట.
‘ధర్మదురై’ ప్రచార కార్యక్రమాల సమయంలో తమన్నా సరిగ్గా సహకరించలేదంటూ తమిళ నటీనటుల సంఘంలో ఆయన ఫిర్యాదు చేశారనే వార్త బయటికొచ్చింది. గురువారం చెన్నైలో ఇదే హాట్ టాపిక్. శుక్రవారం ఈ వార్త గురించి నిర్మాత ఆర్.కె. సురేశ్ వివరణ ఇచ్చారు. ‘‘తమన్నా నా ఫేవరెట్ ఆర్టిస్ట్. తనంటే నాకు చాలా గౌరవం. నా లక్కీ హీరోయిన్. ‘ధర్మదురై’ కోసం నేను అడగ్గానే కథ విని వెంటనే ఒప్పుకుంది. ‘బాహుబలి’ షూటింగ్లో ఉండి కూడా ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు వచ్చింది. వాస్తవానికి నేను నిర్మించే తదుపరి సినిమాలో కూడా తనను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటిది తమన్నా గురించి నేనెందుకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారు. దాంతో గాసిప్పురాయుళ్ల నోటికి తాళం పడింది.