పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
– గత పాలకులు నాగర్‌కర్నూల్‌ను వెనక్కి నెట్టారు
– ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుస్తాం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి
బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి కంటే సాగునీరు రావడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం అంతకన్న ఎక్కువ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని అన్నారు. మండలంలో కేఎల్ఐ 40వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత పాలకుల వల్ల నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వెనక్కి నెట్టేయబడిందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తెలంగాణ సర్కారు ఉంటే జిల్లాలో రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రా నాయకుల పాలనలో ఎన్నికలకు ముందు, తర్వాత ప్రాజెక్టుల వద్ద కొబ్బరికాయలు కొట్టి తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారని, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రైతులు సాగునీరు తెచ్చుకునేందుకు తొందరపడి కాల్వ గట్టు, బ్యాంకింగ్‌లను తొలగించవద్దని, నీరు వచ్చే ప్రతి ప్రాంతానికి నీరు తెస్తామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ ఖగేందర్, డీఈ లోకిలాల్, ఎస్పీఎం వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, గంగనమోని కిరణ్, మహమూద్‌ఖాన్, సర్పంచ్‌లు సుమలత, జ్యోతి, ఎంపీటీసీలు యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, సరస్వతమ్మ తదితరులు ఉన్నారు
కృష్ణమ్మకు పూజలు
కేఎల్ఐ మూడవ లిప్టు ద్వారా నింపిన వడ్డెమాన్ భీమా సముద్రం, పాలెం పల్లెకుంటలో మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు.