వరిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి
వర్ధన్నపేట : వరిలో అగ్గి తెగులు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో గురువారం వరి క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించిన ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో అగ్గితెగులు, మచ్చ తెగులును సమర్థవంతంగా నిర్మూలించడానికి ట్రైఫైక్లోజోల్(బీమ్) లీటరు నీటిలో 0.6 గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే లీటరు నీటిలో 2 గ్రాముల సాఫ్ రసాయనాన్ని కలిపి వారానికి రెండు పర్యాయాలు పంటపై పిచికారీ చేయాలని సూచించారు. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిలో కలుపు ఎక్కువగా వస్తోందని, నివారణకు నామినిగోల్డ్ లీటరు నీటికి 80 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. కందిలో ఎండుతెగులు నివారణకు పాపర్ ఆక్స్(సీఓసీ) మూడు గ్రాము లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని వివరించారు. కార్యక్రమం లో ఏడీఏ పద్మావతి, ఏఓ రాంనర్సయ్య, రైతులు పాల్గొన్నారు.