comprehensive plans
-
హైదరాబాద్ చుట్టూ ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం నలువైపులా మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఐదు కారిడార్లలో మెట్రో విస్తరణకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎండీఏలు సమన్వయంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో దశ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మెట్రో రైల్పై సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు, అత్యధిక జనాభాకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం దారుల్షిఫా నుంచి షాలిబండ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలపగా షాలిబండ వరకే కాకుండా ఫలక్‌నుమా వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ వర్గాలను సంప్రదించాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రోడ్డు విస్తరణ, మెట్రోరైల్ ని ర్మాణం అవసరమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెట్రోరైల్ పొడిగింపు కోసం 103 చోట్ల మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు, స్థానికులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సైతం వస్తానని సీఎం పేర్కొన్నారు. పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో... పాతబస్తీ మీదుగానే ఎయిర్‌పోర్టు మెట్రో చేపట్టాలని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లతో ప్రతిపాదించిన 31 కి.మీ. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గాన్ని నిలిపేయాలన్నారు. ఈ మార్గంలో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ మీదుగా అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలన్నారు. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని సూచించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్–నాగోల్ మధ్య 5కి.మీ. మేర మెట్రో చేపట్టాలని సీఎం చెప్పా రు. ఎయిర్‌పోర్టు మెట్రోపై తక్షణమే ట్రాఫిక్ స్టడీస్‌ను పూర్తి చేసి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని మెట్రోరైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. మెట్రోరైల్ నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా లక్ష్మీగూడ–జల్పల్లి–మామిడిపల్లి రూట్ ను పరిశీలించాలన్నారు. ఈ మార్గంలో 40 అడుగుల సెంట్రల్ మీడియన్ ఉందని, మెట్రో నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్ చెప్పారు. ఈ రూట్‌ను ఎంపిక చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ రూట్లో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్, సీఎంఓ పర్సనల్ సెక్రటరీ శేషాద్రిని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్‌రెడ్డి, సీఎంఓ సెక్రటరీ షానవాజ్ ఖాసిం, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్.... నగర అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రోత్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందువల్లే మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు. జేబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ చేపట్టాలని సూచించారు. రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన 5 కారిడార్లపై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి ముసాయిదా లేఖ పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 40 కి.మీ. మేర మూసీ రివర్‌ఫ్రంట్ ఈస్ట్–వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సింగి వరకు నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా మూసీ మెట్రో చేపట్టాలన్నారు. సీఎం ప్రతిపాదించిన 5 కారిడార్లు ఇలా... ► మియాపూర్–చందానగర్–బీహెచ్ఈఎల్–పటాన్చెరు (14 కి.మీ.) ► ఎంజీబీఎస్–ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–పీ7 రోడ్డు–ఎయిర్‌పోర్టు (23 కి.మీ.) ► నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్–న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కి.మీ.) ► కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షి యల్ డి్రస్టిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుంచి/అమెరికన్ కాన్సులేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు (12 కి.మీ.) ► ఎల్బీనగర్–వనస్థలిపురం–హయత్‌నగర్ (8 కి.మీ.) -
‘రాష్ట్ర అవతరణ’కు ప్రణాళిక రూపొందించండి
- వారం రోజుల పాటు సాంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు - ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలి - జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద ఉత్సవాలు - వివిధ రంగాల వారికి అవార్డుల ప్రదానం : కలెక్టర్ నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తి, అమరుల త్యాగాలు మననం చేసుకునేలా వివిధ సాంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ వేడుకలు గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వారం రోజుల పాటు జూన్ 1 తేదీ రాత్రి పది గంటల నుంచి 7తేదీ వరకు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి, అద్భుత ప్రతిభ కనబర్చిన ప్రముఖులను అవార్డులతో సత్కరించి ఉత్సవాలకు ఉదాత్తను, ఉన్నతిని తీసుకరావాలని కోరారు. తెలంగాణ సంస్కృతికి అద్దె పట్టె కళారూపాలు, ఆటాపాట, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటకాలు, హస్తకళల శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలకు ఏడు రోజుల పాటు విద్యుత్ దీపాలంకరణ చేయాలని, ఫొటో ప్రదర్శనలు, చిత్ర కళా ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలను ప్రదర్శించాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరిత్ర, వారసత్వం, అభివృద్ధిపై సెమినార్, వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు. ఈ ఉత్సవాలను జూన్ 1 తేదీ రాత్రి 10 గంటలకు ప్రారంభించాలని, రాష్ట్రావతరణకు సూచికగా రాత్రి 11.55 గ ంటల నుంచి 12.10 గంటల వరకు బాణా సంచా కాల్పులతో వేడుకలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పథకాలను ఆవిష్కరించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని అమరు వీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ రంగాల వారీకి అవార్డులు... ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. ఉత్తమ రైతు, ఉపాధ్యాయురాలు/ ఉపాధ్యాయుడు, అంగన్వాడీ కార్యకర్త, సామాజిక సేవకుడు/సేవకురాలు, వైద్యుడు/వైద్యురాలు, ఎన్జీఓ, క్రీడాకారుడు, క్రీడాకారిణి, సాహితీవేత్త (కవి, రచయిత, పద్య, గద్య, వచనా, కవితా రంగంలో ప్రసిద్ధుడు/ప్రసిద్ధురాలు, ఉర్ధూ, తెలుగు భాషలలో ఉత్తమ కళాకారుడు/కళాకారిణి, చిత్ర కారులు, శిల్పకారులు, సంగీతకారులు, గాయకులు, నాట్యకారులు, జానపద కళాకారులు) వేద పండితులు, అర్చకులు, న్యాయవాది, జర్నలిస్టు, ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగిని, ఉత్తమ మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు, వివిధ రంగాల్లో సేవలకుగాను అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలోఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ కొరతలేని జిల్లాగా మారాలి
శాసన సభాపతి మధుసూదనాచారి లింగాలఘణపురం : విద్యుత్ కొరతలేని జిల్లాగా వరంగల్ మారాలి... ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి సూచించారు. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల సమీపంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కళ్లెం ఉన్నత పాఠశాలకు ఏకేకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేసిన కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉందని, సగం జిల్లా గోదావరి బేసిన్, సగం కృష్ణా నది బేసిన్ ప్రాంతంలో ఉండడంతో సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో పంటలు పండే భూములు, కష్టం చేసే రైతులు ఉన్నప్పటికీ... సరైన విద్యుత్ సౌకర్యంలేదన్నారు. 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నా... ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నా... కరెంట్, రోడ్లు, మంచి నీరు వంటి సమస్యలన్నీ అలాగే ఉన్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో 2800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, రెండు, మూడేళ్లలో విద్యుత్ కొరత లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందనిఆకాంక్షించారు. పంచాయతీల జనరల్ ఫండ్ వినియోగించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆయన కోరారు.