విద్యుత్ కొరతలేని జిల్లాగా మారాలి
- శాసన సభాపతి మధుసూదనాచారి
లింగాలఘణపురం : విద్యుత్ కొరతలేని జిల్లాగా వరంగల్ మారాలి... ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి సూచించారు. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల సమీపంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం కళ్లెం ఉన్నత పాఠశాలకు ఏకేకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేసిన కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉందని, సగం జిల్లా గోదావరి బేసిన్, సగం కృష్ణా నది బేసిన్ ప్రాంతంలో ఉండడంతో సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు.
ఈ ప్రాంతంలో పంటలు పండే భూములు, కష్టం చేసే రైతులు ఉన్నప్పటికీ... సరైన విద్యుత్ సౌకర్యంలేదన్నారు. 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నా... ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నా... కరెంట్, రోడ్లు, మంచి నీరు వంటి సమస్యలన్నీ అలాగే ఉన్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.
తెలంగాణలో 2800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, రెండు, మూడేళ్లలో విద్యుత్ కొరత లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందనిఆకాంక్షించారు. పంచాయతీల జనరల్ ఫండ్ వినియోగించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆయన కోరారు.