- వారం రోజుల పాటు సాంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు
- ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలి
- జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద ఉత్సవాలు
- వివిధ రంగాల వారికి అవార్డుల ప్రదానం : కలెక్టర్
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తి, అమరుల త్యాగాలు మననం చేసుకునేలా వివిధ సాంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఈ వేడుకలు గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వారం రోజుల పాటు జూన్ 1 తేదీ రాత్రి పది గంటల నుంచి 7తేదీ వరకు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి, అద్భుత ప్రతిభ కనబర్చిన ప్రముఖులను అవార్డులతో సత్కరించి ఉత్సవాలకు ఉదాత్తను, ఉన్నతిని తీసుకరావాలని కోరారు. తెలంగాణ సంస్కృతికి అద్దె పట్టె కళారూపాలు, ఆటాపాట, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటకాలు, హస్తకళల శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలకు ఏడు రోజుల పాటు విద్యుత్ దీపాలంకరణ చేయాలని, ఫొటో ప్రదర్శనలు, చిత్ర కళా ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలను ప్రదర్శించాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరిత్ర, వారసత్వం, అభివృద్ధిపై సెమినార్, వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు.
ఈ ఉత్సవాలను జూన్ 1 తేదీ రాత్రి 10 గంటలకు ప్రారంభించాలని, రాష్ట్రావతరణకు సూచికగా రాత్రి 11.55 గ ంటల నుంచి 12.10 గంటల వరకు బాణా సంచా కాల్పులతో వేడుకలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పథకాలను ఆవిష్కరించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని అమరు వీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
వివిధ రంగాల వారీకి అవార్డులు...
ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. ఉత్తమ రైతు, ఉపాధ్యాయురాలు/ ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ కార్యకర్త, సామాజిక సేవకుడు/సేవకురాలు, వైద్యుడు/వైద్యురాలు, ఎన్‌జీఓ, క్రీడాకారుడు, క్రీడాకారిణి, సాహితీవేత్త (కవి, రచయిత, పద్య, గద్య, వచనా, కవితా రంగంలో ప్రసిద్ధుడు/ప్రసిద్ధురాలు, ఉర్ధూ, తెలుగు భాషలలో ఉత్తమ కళాకారుడు/కళాకారిణి, చిత్ర కారులు, శిల్పకారులు, సంగీతకారులు, గాయకులు, నాట్యకారులు, జానపద కళాకారులు) వేద పండితులు, అర్చకులు, న్యాయవాది, జర్నలిస్టు, ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగిని, ఉత్తమ మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు, వివిధ రంగాల్లో సేవలకుగాను అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలోఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ రావుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
‘రాష్ట్ర అవతరణ’కు ప్రణాళిక రూపొందించండి
Published Sat, May 9 2015 12:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement