ఇక బదిలీలు
పాత మార్గదర్శకాల ప్రకారమే కసరత్తు
ముఖ్యమంత్రి వద్ద ఫైలు,స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత ఉత్తర్వులు
రెండేళ్ల సర్వీసు నిండితేనే బదిలీకి అర్హులు
ఐదేళ్లు ఒకేచోట ఉంటే నిర్బంధ బదిలీ
20 రోజులపాటు కౌన్సెలింగ్‌కు అవకాశం
ఉపాధ్యాయుల బదిలీ, {పమోషన్లు, హేతుబద్ధీకరణ కూడా
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారమే ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తును పూర్తి చేసింది. సంబంధిత ఫైలును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించింది. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు తాజా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందులో పొందుపరచింది. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు బిజీగా ఉన్నందున.. గురువారం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతే ఫైలు ముందుకు కదులుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల సాధారణ మిగతా 2వ పేజీలో ఠ
బదిలీలకు ఏపీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 మేలో దాదాపు అన్ని విభాగాల్లో సాధారణ బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సాధారణంగా ప్రతి ఏడాది మే నెలలో సాధారణ బదిలీలకు సర్కారు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ గత ఏడాది తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పరిణామాలతో ఈ ప్రక్రియను చేపట్టలేదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విభాగాల ఉద్యోగుల నుంచి బదిలీలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. అధికారవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈసారి బదిలీలకూ గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తారు.
20 శాతం మించకుండా బదిలీలు
కమలనాథన్ కమిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర కేడర్, మల్టీ జోనల్ పోస్టులు మినహా.. మిగతా కేడర్ ఉద్యోగులకు సాధారణ బదిలీలతో చిక్కులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిషేధం ఎత్తివేత ఉత్తర్వులు వెలువడ్డాక 20 రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తారు. పైరవీలు, రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా అన్ని విభాగాల్లో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపడుతారు. రెండేళ్ల కనీస సర్వీసు ఉన్న ఉద్యోగులే బదిలీలకు అర్హులవుతారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన ఉద్యోగులను నిర్బంధంగా బదిలీ చేస్తారు. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి మూడు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు సీనియారిటీ జాబితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంగవైకల్యం ఉన్న వారు, భార్యాభర్తలు, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో కేటగిరీలో 20 శాతం మించకుండా ఉద్యోగుల బదిలీలు ఉండాలనే నిబంధనను పాటిస్తారు. వీటికి తోడు పట్టణ ప్రాంతాలు, ప్రాధాన్యత ఉన్న ఫోకల్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులను నాన్ ఫోకల్‌కు బదిలీ చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో లాంగ్ స్టాండింగ్‌గా ఉన్న వారికి న్యాయం జరిగేలా గతంలో ఉన్న మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తారు. మరోవైపు విద్యా శాఖ సిద్ధం చేసిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన ఫైళ్లు కూడా సీఎం దగ్గరే పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ బదిలీల ఫైలుతోపాటు వీటికి సైతం మోక్షం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.