మాన్యువల్ ఫైళ్ల ప్రక్రియను ముగించండి
- రేపటి నుంచి వందశాతం కాగిత రహిత పాలన
- ఆర్డీఓలు, తహసీల్దార్ల సమావేశంలో డీఆర్వో
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూశాఖలో కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మాన్యువల్ ఫైళ్ల ప్రక్రియకు చరమగీతం పాడాలని, వందశాతం కాగిత రహిత పాలనకు ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు సూచించారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఆర్డీఓల సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 తర్వాత మాన్యువల్ ఫైళ్లు కనిపించరాదని డీఆర్వో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు తహసీల్దారు, ఆర్డీఓ వరకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని, డిజిటల్ సిగ్నేచర్ కీ తీసుకోవాలన్నారు. నోట్ ఫైల్ తయారీ నుంచి ఆమోదం వరకు అన్ని పనులు ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఫైళ్లన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరించాలన్నారు.
20 తర్వాత మాన్యువల్‌గా ఫైళ్లు పంపే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే సందర్భంగా ఎన్ఐసీ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రాజశేఖర్ కాగిత రహిత పాలన విధి విధానాలను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఈ- ఆఫీసులుగా మార్చడంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, పరిష్కారాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించి తహసీల్దార్ల అనుమానాలను నివృతి చేశారు. సమావేశంలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.