Computer engineering
-
కంప్యూటర్ ఇంజనీరింగ్కే క్రేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది. 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్... రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు ఈ నెల 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటురద్దు చేసు కున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు. ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపా రు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు. -
కంప్యూటర్ సైన్సే కింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సువైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ ఇటీవల ప్రకటించిన మొదటి దశ ప్రవేశాల్లో అత్యధికం మంది విద్యార్థులు సీఎస్ఈలో సీట్లు పొందేందుకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 183 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా 53,934 మంది విద్యార్థులే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 52,628 మంది విద్యార్థులు మాత్రమే సీట్ల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో అత్యధికంగా 45,514 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో సీటు కోసం వివిధ కాలేజీల్లో 9,50,748 ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఆ తరువాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ) సీట్ల కోసం 35,937 మంది విద్యార్థులు 6,09,278 ఆప్షన్లను ఇచ్చుకున్నా రు. ఇక మూడో స్థానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిలిచింది. అందులో సీట్ల కోసం 21,646 మంది విద్యార్థులు 2,84,064 వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 20,410 మంది, సివిల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 16,608 మంది, మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 14,612 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ఐదు కొత్త కోర్సులు హౌస్‌ఫుల్.. రాష్ట్రంలోని పలు కాలేజీలు ఈసారి ఐదు కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సుతోపాటు కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను అందుబాటులోకి తెచ్చాయి. ఏఐ కోర్సు కన్వీనర్ కోటాలో 84 సీట్లు అందుబాటులోకి ఉండగా వాటిల్లో చేరేందుకు 2,256 మంది విద్యార్థులు 3,580 వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు అందుబాటులోకి రాగా 135 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూ టర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్‌లో 42 సీట్లు ఉంటే వాటిల్లో చేరేందుకు 1,781 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఆచ్చుకు న్నారు. కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)లో 42 సీట్లు ఉంటే 476 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 42 సీట్లు అందుబాటులోకి రాగా, వాటిల్లో చేరేందుకు 1,644 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో దీనికి ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. -
హృదయం: చిత్రమైన బంధం
ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో... మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అతను మలయాళి. చదివింది కంప్యూటర్ ఇంజినీరింగ్. పనిచేసింది ఐటీ ఇండస్ట్రీలో! ఆమె పంజాబీ. చదివింది ఇంగ్లిష్ లిటరేచర్. పనిచేసింది అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో. కానీ వాళ్లిద్దరికీ ‘ఫొటోగ్రఫీ’ అంటే ఇష్టం.. ఆ ఇష్టమే ఒకరినొకరు ఇష్టపడేలా చేసింది. ఆ ఇష్టమే ఇద్దరూ ఒక్కటయ్యేలా చేసింది. ఆ ఇష్టమే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చేసింది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అర్జున్, ప్రేరణల ‘చిత్ర’మైన బంధం ఇది! అర్జున్ కార్తా మలయాళీ అయినా.. చిన్నప్పటి నుంచి దేశమంతా తిరిగాడు. కారణం.. అతని తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడమే. ఆయన అనేక ప్రాంతాల్లో నివాసం ఉండటంతో అర్జున్ చాలా భాషలు నేర్చుకున్నాడు. ఎయిర్‌ఫోర్స్ స్కూళ్లలో, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుని ఎదిగిన అర్జున్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రకరకాల ఉద్యోగాలు చేశాడు. టెక్‌మహీంద్రా, ఐబీఎం వంటి పెద్ద ఐటీ కంపెనీల్లో మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశాడు. కానీ ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేకపోయాయి. చిన్ననాటి నుంచి తనకెంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలన్నది అతని కోరిక. ఇక ప్రేరణ సంగతి చూస్తే ఆమె కుటుంబం ఢిల్లీలో సెటిలైంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు. ఆ తర్వాత క్యాట్ రాయడానికి ప్రయత్నించి మధ్యలో వదిలేసి ప్రకటనల రంగంలోకి వెళ్లింది. అందులో అనేక కంపెనీలు చుట్టేసింది. అయితే ఇంకొకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక సొంత మార్గం చూసుకుంది. ఇలాంటి స్థితిలో ఓ కామన్ ఫ్రెండు ద్వారా ఓ పార్టీలో కలిశారు అర్జున్, ప్రేరణ. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చారు. కానీ బయటపడలేదు. వారు ఒకరికి ఒకరు చెప్పుకోకుండానే చేసిన ప్రేమ ప్రయాణంలో ఇద్దరి అభిరుచి ఒకటే అని తెలిసింది. అదే ఫొటోగ్రఫీ. ఆ అభిరుచే వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. ముందుగా అర్జునే ప్రేరణకు ప్రపోజ్ చేశాడు. లోపల సంతోషిస్తూనే పైకి సున్నితంగా తిరస్కరించింది ప్రేరణ. మరోసారి... ఇంకోసారి... అర్జున్ తన ప్రయత్నాలు మానుకోలేదు. ఆమె దానిని ఆనందిస్తూనే అతను దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అర్జున్‌కి కొన్నాళ్లకి విషయం అర్థమైంది. అతనూ ప్రేమ బింకాలు మొదలుపెట్టాడు. చివరికి ప్రేరణ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరివి వేర్వేరు రాష్ట్రాలు, భాషలు, సంప్రదాయాలు. ఐతే ఎలాగోలా ధైర్యం చేసి ఇంట్లో చెప్పేశారు. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. అర్జున్ తల్లిదండ్రులు కొడుకు కోసం అయిష్టంగా ఒప్పుకున్నారు. కానీ ప్రేరణ పేరెంట్స్ నో అంటే నో అన్నారు. తల్లిదండ్రులను ఒప్పించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది ప్రేరణ... చివరకు సాధించింది. అలా వారి ప్రణయం పరిణయంగా మారింది. అయితే, అసలు సమస్య అప్పుడే మొదలైంది. అప్పటికే అర్జున్ ఉద్యోగం మానేశాడు. ఫొటోగ్రఫీ కెరీర్లో ఉన్నాడు. ఇంకా అది అభిరుచి స్థాయిలోనే ఉంది. పూర్తిగా స్థిరపడలేదు. ప్రేరణా ఉద్యోగంలోనే ఉంది. ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో. మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆమె కూడా ఉద్యోగం మానేసింది! అతడితో కలిసి నడిచింది. ఇద్దరూ ఫొటోగ్రఫీలో బిజీ అయిపోయారు. కానీ కొంతకాలం వరకు వారి ఫొటోగ్రఫీ వ్యాపార రూపం దాల్చలేదు. దీంతో ఆదాయం లేకుండా పోయింది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారి ప్రేమను పలుచన చేయలేకపోయాయి. అభిరుచిని కొద్దిగా మార్చి ఇద్దరూ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టారు. అతను ఫొటోలు తీస్తే.. ఆమె కాన్సెప్టులు క్రియేట్చేసేది. ఆ క్రమంలో కొన్ని లక్షల ఫొటోల్ని పరిశీలించి.. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను పెంచారు. కొత్త కాన్సెప్టులతో ఫొటోలు తీశారు. కొత్తజంటలు మైమరిచిపోయాలా ఆల్బమ్‌లు సృష్టించారు. దీంతో సెలబ్రిటీల వరకు వారి పనితనం వెళ్లింది. పెద్ద ఆర్డర్లు వచ్చాయి. తమ అన్యోన్యత ప్రేమలోనే కాదు పనిలోనూ చూపించారు. ‘అర్జున్ కార్తా ఫొటోగ్రఫీ’ అనే ఒక బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నారు. అంతటితో ఆగలేదు... వెడ్డింగ్ వోస్ పేరుతో ఫొటోగ్రఫీ-ఫుడ్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ఈ ఫుడ్ ఎక్కడిది అనుకుంటున్నారా? ప్రేరణ ఆ వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ఫుడ్ డిపార్టమెంట్‌పై కూడా తన సృజనను ప్రయోగించింది. కుకింగ్ తర్వాత ఫుడ్ స్టైలింగ్ మీద దృష్టిపెట్టింది. ఇపుడు ఫుడ్ డీ దమ్ పేరుతో ఒక బ్లాగు కూడా నడుపుతోంది. చివరకు కొన్ని హోటల్స్ తమకు అవసరమైన ప్రచార చిత్రాలకు ఆమెతో ఫొటోలు తీయించుకునే దాకా నైపుణ్యం పెంచుకుంది. అర్జున్ అయితే 2011 ఏడాదికి ఏకంగా ‘కొడాక్ బెస్ట్ వెడ్డింగ్ ఫొటో’ అవార్డు దక్కించుకున్నారు. మొత్తానికి వీళ్లిద్దరూ అద్వితీయమైన ప్రేమ జంటగా జీవనయానాన్ని సంతోషంగా లాగిస్తున్నారు.