హృదయం: చిత్రమైన బంధం | A Couple have passion to recognize in Wedding photography nationwide | Sakshi
Sakshi News home page

హృదయం: చిత్రమైన బంధం

Published Sun, Jun 29 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

హృదయం: చిత్రమైన బంధం

హృదయం: చిత్రమైన బంధం

ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో... మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అతను మలయాళి. చదివింది కంప్యూటర్ ఇంజినీరింగ్. పనిచేసింది ఐటీ ఇండస్ట్రీలో! ఆమె పంజాబీ. చదివింది ఇంగ్లిష్ లిటరేచర్. పనిచేసింది అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో. కానీ వాళ్లిద్దరికీ ‘ఫొటోగ్రఫీ’ అంటే ఇష్టం.. ఆ ఇష్టమే ఒకరినొకరు ఇష్టపడేలా చేసింది. ఆ ఇష్టమే ఇద్దరూ ఒక్కటయ్యేలా చేసింది. ఆ ఇష్టమే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చేసింది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అర్జున్, ప్రేరణల ‘చిత్ర’మైన బంధం ఇది!
 
 అర్జున్ కార్తా మలయాళీ అయినా.. చిన్నప్పటి నుంచి దేశమంతా తిరిగాడు. కారణం.. అతని తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడమే. ఆయన అనేక ప్రాంతాల్లో నివాసం ఉండటంతో అర్జున్ చాలా భాషలు నేర్చుకున్నాడు. ఎయిర్‌ఫోర్స్ స్కూళ్లలో, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుని ఎదిగిన అర్జున్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రకరకాల ఉద్యోగాలు చేశాడు.
 
 టెక్‌మహీంద్రా, ఐబీఎం వంటి పెద్ద ఐటీ కంపెనీల్లో మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశాడు. కానీ ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేకపోయాయి. చిన్ననాటి నుంచి తనకెంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలన్నది అతని కోరిక. ఇక ప్రేరణ సంగతి చూస్తే ఆమె కుటుంబం ఢిల్లీలో సెటిలైంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు. ఆ తర్వాత క్యాట్ రాయడానికి ప్రయత్నించి మధ్యలో వదిలేసి ప్రకటనల రంగంలోకి వెళ్లింది. అందులో అనేక కంపెనీలు చుట్టేసింది. అయితే ఇంకొకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక సొంత మార్గం చూసుకుంది.
 
 ఇలాంటి స్థితిలో ఓ కామన్ ఫ్రెండు ద్వారా ఓ పార్టీలో కలిశారు అర్జున్, ప్రేరణ. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చారు. కానీ బయటపడలేదు. వారు ఒకరికి ఒకరు చెప్పుకోకుండానే చేసిన ప్రేమ ప్రయాణంలో ఇద్దరి అభిరుచి ఒకటే అని తెలిసింది. అదే ఫొటోగ్రఫీ. ఆ అభిరుచే వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. ముందుగా అర్జునే ప్రేరణకు ప్రపోజ్ చేశాడు. లోపల సంతోషిస్తూనే పైకి సున్నితంగా తిరస్కరించింది ప్రేరణ. మరోసారి... ఇంకోసారి... అర్జున్ తన ప్రయత్నాలు మానుకోలేదు. ఆమె దానిని ఆనందిస్తూనే అతను దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది.
 
 అర్జున్‌కి కొన్నాళ్లకి విషయం అర్థమైంది. అతనూ ప్రేమ బింకాలు మొదలుపెట్టాడు. చివరికి ప్రేరణ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరివి వేర్వేరు రాష్ట్రాలు, భాషలు, సంప్రదాయాలు. ఐతే ఎలాగోలా ధైర్యం చేసి ఇంట్లో చెప్పేశారు. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. అర్జున్ తల్లిదండ్రులు కొడుకు కోసం అయిష్టంగా ఒప్పుకున్నారు. కానీ ప్రేరణ పేరెంట్స్ నో అంటే నో అన్నారు. తల్లిదండ్రులను ఒప్పించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది ప్రేరణ... చివరకు సాధించింది. అలా వారి ప్రణయం పరిణయంగా మారింది.
 
 అయితే, అసలు సమస్య అప్పుడే మొదలైంది. అప్పటికే అర్జున్ ఉద్యోగం మానేశాడు. ఫొటోగ్రఫీ కెరీర్‌లో ఉన్నాడు. ఇంకా అది అభిరుచి స్థాయిలోనే ఉంది. పూర్తిగా స్థిరపడలేదు.  ప్రేరణా ఉద్యోగంలోనే ఉంది. ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో. మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆమె కూడా ఉద్యోగం మానేసింది! అతడితో కలిసి నడిచింది. ఇద్దరూ ఫొటోగ్రఫీలో బిజీ అయిపోయారు. కానీ కొంతకాలం వరకు వారి ఫొటోగ్రఫీ వ్యాపార రూపం దాల్చలేదు. దీంతో ఆదాయం లేకుండా పోయింది.
 
  అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారి ప్రేమను పలుచన చేయలేకపోయాయి. అభిరుచిని కొద్దిగా మార్చి ఇద్దరూ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టారు. అతను ఫొటోలు తీస్తే.. ఆమె కాన్సెప్టులు క్రియేట్‌చేసేది. ఆ క్రమంలో కొన్ని లక్షల ఫొటోల్ని పరిశీలించి.. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను పెంచారు. కొత్త కాన్సెప్టులతో ఫొటోలు తీశారు. కొత్తజంటలు మైమరిచిపోయాలా ఆల్బమ్‌లు సృష్టించారు.  దీంతో సెలబ్రిటీల వరకు వారి పనితనం వెళ్లింది. పెద్ద ఆర్డర్లు వచ్చాయి. తమ అన్యోన్యత ప్రేమలోనే కాదు పనిలోనూ చూపించారు. ‘అర్జున్ కార్తా ఫొటోగ్రఫీ’ అనే ఒక బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నారు.  అంతటితో ఆగలేదు... వెడ్డింగ్ వోస్ పేరుతో ఫొటోగ్రఫీ-ఫుడ్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ఈ ఫుడ్ ఎక్కడిది అనుకుంటున్నారా? ప్రేరణ ఆ వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ఫుడ్ డిపార్టమెంట్‌పై కూడా తన సృజనను ప్రయోగించింది. కుకింగ్ తర్వాత ఫుడ్ స్టైలింగ్ మీద దృష్టిపెట్టింది. ఇపుడు ఫుడ్ డీ దమ్ పేరుతో ఒక బ్లాగు కూడా నడుపుతోంది.
 
 చివరకు కొన్ని హోటల్స్ తమకు అవసరమైన ప్రచార చిత్రాలకు ఆమెతో ఫొటోలు తీయించుకునే దాకా నైపుణ్యం పెంచుకుంది. అర్జున్ అయితే 2011 ఏడాదికి ఏకంగా ‘కొడాక్ బెస్ట్ వెడ్డింగ్ ఫొటో’ అవార్డు దక్కించుకున్నారు. మొత్తానికి వీళ్లిద్దరూ అద్వితీయమైన ప్రేమ జంటగా జీవనయానాన్ని సంతోషంగా లాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement