Wedding Photography
-
ఫొటోగ్రాఫర్ దారుణ హత్య
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు. వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు. అనుమానం వచ్చిందేమో! కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఫొటోషూట్‌లో లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే
ఈ పదాలను సినిమా షూటింగ్లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్ షాట్స్‌తో సినిమా షూటింగ్‌ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఫొటోషూట్‌ను సినిమా షూటింగ్ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్‌ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్‌లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్ షాట్స్, క్రేన్ షాట్స్‌తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్వేరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాన్డెట్ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. జవహర్‌నగర్‌లో 200 స్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్లు రావడంతో పాటు మార్కెట్ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్‌నగర్ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఉన్నాయి. తక్కువ ఖర్చులోనే.. తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్ షాట్స్ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. – శ్రీకాంత్‌యాదవ్, జవహర్‌నగర్ ఎంతో మందికి ఉపాధి.. ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. – సంపత్, అంబేడ్కర్‌నగర్ -
పెళ్లి ఫోటోల్లో న్యూ ట్రెండ్
-
పెళ్లి ఫొటోల్లో.. పిచ్చి పీక్స్!
పెళ్లి ఫొటోలను ఆయా ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో తీస్తుంటారు. ఇందుకోసం వాళ్లు రకరకాల కష్టాలు పడుతుంటారు. సమయానికి లైటింగ్ సరిగ్గా ఉండాలి, తాము అనుకున్న ఫ్రేము సరిగ్గా రావాలి, అంతా చేసి ఫొటో తీశాక వధూవరుల్లో ఒకళ్లు కళ్లు మూయడమో, లేదా వేరేవైపు చూడటమో జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు డిజిటల్ ఆల్బంలు వచ్చిన తర్వాత.. చిత్ర విచిత్రమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తూ.. వాటిని ఆ తర్వాత వధూవరులకు కానుకగా అందిస్తున్నారు. ఇందుకోసం పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత.. వధూవరులను మాత్రమే ఒకచోట ఉంచి వాళ్లను రకరకాలుగా ఫొటోలు తీస్తున్నారు. సరిగ్గా అలాంటి ఫొటో ఒకదాన్ని హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేశాడు. వధూవరులిద్దరూ ఎదురెదురుగా ఉండి చేతులు పట్టుకుని ఉండగా.. ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరి మధ్య కింద పడుకుని సరిగ్గా ఆ చేతుల కిందకు తన కెమెరా వచ్చేలా ఉన్నాడు. ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ.. 'వెడ్డింగ్ ఫొటోల పిచ్చి పీక్స్' అని కామెంట్ పెట్టాడు. ఆ ట్వీట్‌ను మరో హీరో దగ్గుబాటి రానా కూడా రీట్వీట్ చేశాడు. Picchih peakss of Wedding Photography :-)) pic.twitter.com/egVvFcVZKB — Nikhil Siddhartha (@actor_Nikhil) February 9, 2016 -
హృదయం: చిత్రమైన బంధం
ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో... మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అతను మలయాళి. చదివింది కంప్యూటర్ ఇంజినీరింగ్. పనిచేసింది ఐటీ ఇండస్ట్రీలో! ఆమె పంజాబీ. చదివింది ఇంగ్లిష్ లిటరేచర్. పనిచేసింది అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో. కానీ వాళ్లిద్దరికీ ‘ఫొటోగ్రఫీ’ అంటే ఇష్టం.. ఆ ఇష్టమే ఒకరినొకరు ఇష్టపడేలా చేసింది. ఆ ఇష్టమే ఇద్దరూ ఒక్కటయ్యేలా చేసింది. ఆ ఇష్టమే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చేసింది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అర్జున్, ప్రేరణల ‘చిత్ర’మైన బంధం ఇది! అర్జున్ కార్తా మలయాళీ అయినా.. చిన్నప్పటి నుంచి దేశమంతా తిరిగాడు. కారణం.. అతని తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడమే. ఆయన అనేక ప్రాంతాల్లో నివాసం ఉండటంతో అర్జున్ చాలా భాషలు నేర్చుకున్నాడు. ఎయిర్‌ఫోర్స్ స్కూళ్లలో, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుని ఎదిగిన అర్జున్ ఇంజినీరింగ్ పూర్తి చేసి రకరకాల ఉద్యోగాలు చేశాడు. టెక్‌మహీంద్రా, ఐబీఎం వంటి పెద్ద ఐటీ కంపెనీల్లో మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశాడు. కానీ ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేకపోయాయి. చిన్ననాటి నుంచి తనకెంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకోవాలన్నది అతని కోరిక. ఇక ప్రేరణ సంగతి చూస్తే ఆమె కుటుంబం ఢిల్లీలో సెటిలైంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలు. ఆ తర్వాత క్యాట్ రాయడానికి ప్రయత్నించి మధ్యలో వదిలేసి ప్రకటనల రంగంలోకి వెళ్లింది. అందులో అనేక కంపెనీలు చుట్టేసింది. అయితే ఇంకొకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక సొంత మార్గం చూసుకుంది. ఇలాంటి స్థితిలో ఓ కామన్ ఫ్రెండు ద్వారా ఓ పార్టీలో కలిశారు అర్జున్, ప్రేరణ. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చారు. కానీ బయటపడలేదు. వారు ఒకరికి ఒకరు చెప్పుకోకుండానే చేసిన ప్రేమ ప్రయాణంలో ఇద్దరి అభిరుచి ఒకటే అని తెలిసింది. అదే ఫొటోగ్రఫీ. ఆ అభిరుచే వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. ముందుగా అర్జునే ప్రేరణకు ప్రపోజ్ చేశాడు. లోపల సంతోషిస్తూనే పైకి సున్నితంగా తిరస్కరించింది ప్రేరణ. మరోసారి... ఇంకోసారి... అర్జున్ తన ప్రయత్నాలు మానుకోలేదు. ఆమె దానిని ఆనందిస్తూనే అతను దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అర్జున్‌కి కొన్నాళ్లకి విషయం అర్థమైంది. అతనూ ప్రేమ బింకాలు మొదలుపెట్టాడు. చివరికి ప్రేరణ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరివి వేర్వేరు రాష్ట్రాలు, భాషలు, సంప్రదాయాలు. ఐతే ఎలాగోలా ధైర్యం చేసి ఇంట్లో చెప్పేశారు. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. అర్జున్ తల్లిదండ్రులు కొడుకు కోసం అయిష్టంగా ఒప్పుకున్నారు. కానీ ప్రేరణ పేరెంట్స్ నో అంటే నో అన్నారు. తల్లిదండ్రులను ఒప్పించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది ప్రేరణ... చివరకు సాధించింది. అలా వారి ప్రణయం పరిణయంగా మారింది. అయితే, అసలు సమస్య అప్పుడే మొదలైంది. అప్పటికే అర్జున్ ఉద్యోగం మానేశాడు. ఫొటోగ్రఫీ కెరీర్లో ఉన్నాడు. ఇంకా అది అభిరుచి స్థాయిలోనే ఉంది. పూర్తిగా స్థిరపడలేదు. ప్రేరణా ఉద్యోగంలోనే ఉంది. ఆమె ఉద్యోగంలో, అతను ఫొటోగ్రఫీ టూర్లలో. మనసులు దగ్గరగా... మనుషులు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆమె కూడా ఉద్యోగం మానేసింది! అతడితో కలిసి నడిచింది. ఇద్దరూ ఫొటోగ్రఫీలో బిజీ అయిపోయారు. కానీ కొంతకాలం వరకు వారి ఫొటోగ్రఫీ వ్యాపార రూపం దాల్చలేదు. దీంతో ఆదాయం లేకుండా పోయింది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారి ప్రేమను పలుచన చేయలేకపోయాయి. అభిరుచిని కొద్దిగా మార్చి ఇద్దరూ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టారు. అతను ఫొటోలు తీస్తే.. ఆమె కాన్సెప్టులు క్రియేట్చేసేది. ఆ క్రమంలో కొన్ని లక్షల ఫొటోల్ని పరిశీలించి.. వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను పెంచారు. కొత్త కాన్సెప్టులతో ఫొటోలు తీశారు. కొత్తజంటలు మైమరిచిపోయాలా ఆల్బమ్‌లు సృష్టించారు. దీంతో సెలబ్రిటీల వరకు వారి పనితనం వెళ్లింది. పెద్ద ఆర్డర్లు వచ్చాయి. తమ అన్యోన్యత ప్రేమలోనే కాదు పనిలోనూ చూపించారు. ‘అర్జున్ కార్తా ఫొటోగ్రఫీ’ అనే ఒక బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నారు. అంతటితో ఆగలేదు... వెడ్డింగ్ వోస్ పేరుతో ఫొటోగ్రఫీ-ఫుడ్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ఈ ఫుడ్ ఎక్కడిది అనుకుంటున్నారా? ప్రేరణ ఆ వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో ఫుడ్ డిపార్టమెంట్‌పై కూడా తన సృజనను ప్రయోగించింది. కుకింగ్ తర్వాత ఫుడ్ స్టైలింగ్ మీద దృష్టిపెట్టింది. ఇపుడు ఫుడ్ డీ దమ్ పేరుతో ఒక బ్లాగు కూడా నడుపుతోంది. చివరకు కొన్ని హోటల్స్ తమకు అవసరమైన ప్రచార చిత్రాలకు ఆమెతో ఫొటోలు తీయించుకునే దాకా నైపుణ్యం పెంచుకుంది. అర్జున్ అయితే 2011 ఏడాదికి ఏకంగా ‘కొడాక్ బెస్ట్ వెడ్డింగ్ ఫొటో’ అవార్డు దక్కించుకున్నారు. మొత్తానికి వీళ్లిద్దరూ అద్వితీయమైన ప్రేమ జంటగా జీవనయానాన్ని సంతోషంగా లాగిస్తున్నారు.