ఈవెంట్ పేరుతో పిలిచి కెమేరాలు, పరికరాలు దొంగిలించి దారుణం
వారం రోజుల తర్వాత ఘటన వెలుగులోకి..
ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు
ఆలమూరు/మధురవాడ/పీఎం పాలెం : సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ఈవెంట్ చేద్దామని పిలిచి, స్నేహితుడితో కలిసి ఓ ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విశాఖ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలేనికి చెందిన పోతిన సాయి(21)కి ఫొటోలు, వీడియోలు తీయడం హాబీ. అతడికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన షణ్ముఖ తేజతో సోషల్ మీడియాలో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో సాయి వద్ద రూ.12.70 లక్షల విలువైన కెమేరాలు, ఇతర పరికరాలున్నాయని తేజ గుర్తించాడు.
వాటిని ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంతో అతడు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫొటోగ్రాఫర్‌నని, ఏవైనా ఈవెంట్లు ఉంటే కలసి చేద్దామని సాయిని నమ్మించాడు. రాజమహేంద్రవరంలో ఈవెంట్ ఉందని సాయిని తేజ నమ్మించాడు. సాయి గత నెల 26వ తేదీ మధ్యాహ్నం విలువైన కెమేరాలు, పరికరాలతో రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అప్పటికే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన స్నేహితుడు వినోద్‌కుమార్‌తో తేజ రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్నాడు. అద్దెకు తీసుకున్న కారులో సాయిని ఎక్కించుకుని, సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ సాయంత్రానికి వేమగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం అక్కడే సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు.
అనుమానం వచ్చిందేమో!
కారులో తనను ఇష్టానుసారంగా తిప్పడం వల్లో ఏమోగానీ తేజపై సాయికి అనుమానం వచ్చింది. మధ్యలో కారు ఫొటోతో పాటు తేజ ఫోన్ నంబర్‌ను కూడా తన తల్లి రమణమ్మకు వాట్సాప్‌లో పంపాడు. ఈ నేపథ్యంలో మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశి్నంచి కొంత సమాచారం రాబట్టారు. కాగా, విశాఖ కంచరపాలేనికి చెందిన యువతితో తేజ చాటింగ్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని విచారించగా.. ఈ హత్యాపన్నాగం బయట పడినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment