సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి.
సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది.
20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్...
రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు ఈ నెల 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటురద్దు చేసు కున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు.
ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపా రు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment