రాజమండ్రిలో 7 వేల కిలోల లడ్డూ తయారీ..గిన్నిస్ లో చోటు!
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో మూడవసారి చోటు సంపాదించేందుకు రాజమండ్రిలోని ఓ మిఠాయి దుకాణం నిర్వహకులు ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూ తయారీలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ 7 వేల కిలోల భారీ లడ్డూని తయారు చేస్తున్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు భారీ లడ్డూని అందచేస్తామని తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ షాప్ యజమాని ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే వెంకటేశ్వరరావు 2011, 2012 లో రెండుసార్లు గిన్నిస్ బుక్ లో తన పేరుని నమోదు చేసుకున్నారు.
భారీ లడ్డు తయారీకి 2 వేల కిలోల చక్కెర, 2వేల కిలోల చనా దాల్, 1500 కిలోల నెయ్యితోపాటు బాదంపప్పు ఇతర దినుసులు వినియోగిస్తున్నారు. అతిపెద్ద లడ్డూ తయారీకి 16 మంది వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. భారీ లడ్డూ తయారీకి సుమారు 14.80 లక్షలు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటలకు పుష్కరఘాట్ కు ఊరేగింపుగా బయలుదేరుతామని వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలోనే గిన్నిస్ బుక్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు. ఈ భారీ లడ్డూయే కాకుండా మరో 500 లడ్డూల తయారీలో నిమగ్నమయ్యామని.. తెలంగాణలోని నిజమాబాద్, హైదరాబాద్, కోస్తాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరంతోపాటు పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లు అందాయన్నారు. తన వ్యాపారంపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఏమిలేదని వెంకటేశ్వరరావు తెలిపారు.