భగ్గు మంటున్న గ్రామస్తులు
సాక్షి, సిటీబ్యూరో: శివారు గ్రామపంచాయతీల విలీన ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సర్కారు ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజాప్రతినిధుల మాట వినకుండా జీహెచ్ఎంసీలో 21 గ్రామాలను విలీనం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం కూడా పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. గ్రామ పంచాయతీల రికార్డులను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఉదయం నుంచే పంచాయతీ కార్యలయాలకు చేరుకున్నారు. ధర్నాలు చేసి, కార్యాలయాలకు తాళాలు వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇప్పటికే 625 చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రజలకు పలు సమస్యలు సృష్టిస్తున్న జీహెచ్ఎంసీలో ఇతర గ్రామాలను కలపవద్దంటూ సర్వసభ్య సమావేశం తీర్మానించినా.. పచ్చని చేలతో, పంట పొలాలతో ఉన్న తమ గ్రామాల్లో ఎలంటి సదుపాయాలు కల్పించకుండా కేవలం పన్నుల కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దంటూ ఆయా గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకోని సర్కారు విలీనం చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీలో శివారు ప్రజలు తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోకున్నా.. భారీగా ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్‌లెసైన్సు ఫీజులు వంటివి వసూలు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
విలీనం ఏ శక్తుల కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. నగరానికి దగ్గర్లో ఉన్న గ్రామాలను కాదని దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేయడంలో హేతుబద్ధీకరణ ఉందా? అని మండిపడుతున్నారు. ఉదాహరణకు ఉప్పల్ సర్కిల్‌కు దగ్గర్లోని బోడుప్పల్‌ను కాకుండా దూరంగా ఉన్న పర్వతాపూర్, ఫిర్జాదిగూడలను కలపడంలో ఆంతర్యమేంటని ధ్వజమెత్తుతున్నారు. అలాగే మణికొండ, కోకాపేట, గండిపేట, మంచిరేవులను మాత్రం పంచాయతీలుగానే ఉంచినప్పటికీ, వాటికంటే దూరంగా కుగ్రామంగా ఉన్న వట్టినాగులపల్లిని విలీనం చేయడంపై ఆ గ్రామ ప్రజలు శివాలెత్తుతున్నారు. మంగళవారం అధికారులను నిర్బంధించిన ఆ గ్రామస్తులు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. పీర్జాదిగూడ, పర్వతాపూర్లలోనూ రాజకీయాలకతీతంగా ఆందోళనలు చేశారు. పర్వతాపూర్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.
షోకాజ్ ఏదీ..?
15 గ్రామాల విలీనం జీహెచ్ఎంసీ జనరల్ కౌన్సిల్లో చర్చకు వ చ్చినప్పుడు అంగీకరించేది లేదంటూ పాలకమండలి తిరస్కరించినప్పటికీ, ప్రభుత్వం తన విశేషాధికారాలతో విలీనం చేసింది. అయితే, ఆ తీర్మానాన్ని అంగీకరించని పక్షంలో షోకాజ్ జారీ చేయాల్సి ఉంటుందని నిబంధన లు క్షుణ్ణంగా తెలిసిన ఓ అధికారి తెలిపారు. ఓవైపు.. ఢిల్లీ, ముంబై వంటి కార్పొరేషన్లను పరిపాలనా సౌలభ్యం కోసం అదనపు కార్పొరేషన్లుగా విభజించగా.. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచడం.. మరిన్ని సమస్యలు సృష్టించడమేనని మునిసిపల్ పరిపాలనపై అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్నీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. విభజన కోసం ఉద్యమాలు జరుగుతుండగా, అందరూ వద్దంటున్నా విలీనం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.