అణుశక్తిమాన్!
సంక్షిప్తంగా... హోమీ భాభా
ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా. ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. జగద్విజేత! అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు. పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు.
1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో, అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో!
దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా!
నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి.
బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు.
భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా. ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఆయన స్వగృహం మెహరంగిర్ను ఇటీవలి వేలంలో ఎన్.సి.పి.ఎ. (నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) సంస్థ రూ. 372 కోట్లకు దక్కించుకుంది.
- భావిక