హగ్ చేసుకున్నట్టు భావించండి!
టిఫానీ మిల్లర్ తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఎప్పటిలాగే పిజ్జాహౌస్కు లంచ్ కోసం వెళ్లింది. అక్కడ ఆమెను ఓ దృశ్యం కట్టిపడేసింది. ఓ వృద్ధుడు మరో కురువృద్ధుడికి అన్నం తినిపిస్తున్నాడు. వీల్‌చైర్‌లో ఉన్న కురువృద్ధుడికి ఆహారం తినిపించి, నీళ్లను తాగించి.. అనంతరం నోటిని తుడిచాడు. కురువృద్ధుడైన తన తండ్రి భుజించిన తర్వాత 60 ఏళ్ల వయస్సున్న అతను ఆహారం తీసుకున్నాడు. మానవ ఆత్మీయతానుబంధాలు ఉట్టిపడే ఆ ఘట్టం చూసిన తర్వాత మిల్లర్ ఉండబట్టలేకపోయింది. వెంటనే వారి వద్దకు వెళ్లి మీరు చూపిన ఆత్మీయతానురాగాలు తనను కదిలింపజేశాయని, వారికి కృతజ్ఞతలు తెలిపింది. అందుకు బదులుగా ఆ వ్యక్తి మిల్లర్‌కు 'థాంక్స్' చెప్పాడు. 'ఇలాంటి మాటలు నేను నిత్యం వింటూ ఉంటాను' అని చెప్పాడు.
ఆ తర్వాత మిల్లర్ తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది. కాసేపటి తర్వాత మిల్లర్ దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి 'మీరు నన్ను అభినందించారు. ప్రతిగా నేను మిమల్ని ఆభినందిస్తాను' అంటూ ఓ నాప్కిన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆ నాప్కిన్పైన 'సీవైహెచ్' అనే అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల అర్థం 'కన్సిడర్ యువర్ సెల్ప్ హగ్డ్' (మిమ్నల్ని ఆలింగనం చేసుకున్నట్టు భావించండి) అని చెప్పాడు. అతడి ఆత్మీయత మిల్లర్‌ను కంటతడి పెట్టేలా చేసింది. అతన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అతని తండ్రి కొరియన్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడని తెలుసుకుంది. మానవతను గుర్తుచేసిన ఈ ఘట్టాన్ని అమెరికాలోని మిల్‌విల్లే వాసురాలైన ఆమె ఓ ఫేస్బుక్ పేజీలో ప్రచురించింది. అప్పటినుంచి ఈ ఆత్మీయ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.