కామెడ్-కేలో తెలుగు తేజం
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశం కోసం గత నెల నిర్వహించిన కన్సోర్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామెడ్-కే) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన కొండవీటి ధరన్ మొత్తం 180 మార్కులకు గాను 164 మార్కులతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. కామెడ్-కేకు మొత్తం 90,264 (మెడికల్ విభాగంలో 47,085 ఇంజనీరింగ్ విభాగంలో 43,179) విద్యార్థులు పరీక్ష రాశారు.
అందులో 23,794 మంది వైద్య, దంత వైద్య విభాగంలో ప్రవేశానికి అర్హత సాధించగా, ఇంజనీరింగ్ కోర్సులో 43,179 మంది అర్హత సాధించారు. కాగా, కామెడ్ కే పరిధిలో 17,698 ఇంజనీరింగ్, 835 వైద్య, 766 దంత వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి. కామెడ్-కే కౌన్సిలింగ్ షెడ్యూల్లు త్వరలోనే వెల్లడిస్తామని ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ డాక్టర్ ఎస్.కుమార్ తెలిపారు.
ఫలితాలు సంస్థ వెబ్సైట్ www.comed k.org లో అందుబాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలకు 08041228992లో సంప్రదించవచ్చని సూచించారు. కాగా, ఇంజనీరింగ్లో మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది మంది కర్ణాటకకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అదే విధంగా మెడికల్లో మూడు ర్యాంకులను కర్ణాటకకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకోగా మిగిలిన ఏడు ర్యాంకులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సీఈటీలో మొదటి ర్యాంకు సాధించిన గిరిజా అగర్వాల్ కామెడ్-కేలోనూ మొదటి ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు
సాధించిన విద్యార్థులు
1. టీ. దినేష్రాం కుమార్ (కర్ణాటక-బెంగళూరు)
2. కొండవీటి థరణ్ (ఆంధ్రప్రదేశ్-రాజమండ్రి)
3. టీ.ఎం ప్రజ్వల (కర్ణాటక-బెంగళూరు)
మొడికల్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు
పొందిన విద్యార్థులు
1. గిరిజా అగర్వాల్ (కర్ణాటక-బెంగళూరు)
2. ఆదిత్యా అగర్వాల్ (గుజరాత్-పాలన్పూర్)
3. శివాని వశిష్ట్ (న్యూ ఢిల్లీ-మాయాపురి)
ఈ ఏడాది ఫీజుల వివరాలు (ఏడాదికి)
వైద్య విద్య - రూ.3,57,500
దంత వైద్య - రూ.2,53,000
ఇంజినీరింగ్ - రూ.50,000