Consultancy Services
-
విప్రో 10,500 కోట్ల షాపింగ్!
న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్కోను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా పేర్కొంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. క్యాప్కోను సొంతం చేసుకునేందుకు 1.45 బిలియన్ డాలర్లను(రూ. 10,500 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలుకావడం గమనార్హం! క్యాప్కో కొను గోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో కన్సల్టింగ్, ఐటీ సర్వీసులందించడంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు విప్రో వివరించింది. ఈ విభాగంలోని అంతర్జాతీయ క్లయింట్ల(సంస్థలు)కు పటిష్టమైన, సమర్ధవంత కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల వ్యూహాత్మక డిజైన్, డొమైన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, క్లౌడ్ తదితర సేవలకు క్యాప్కోకున్న కన్సల్టింగ్ సమర్ధత జత కలవనున్నట్లు పేర్కొంది. వెరసి బ్యాంకింగ్ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా తదితర విభాగాలలో మరింత మెరుగైన సేవలకు వీలున్నట్లు తెలియజేసింది. క్యాప్కో తీరిదీ...: 1998లో ఏర్పాటైన క్యాప్కో ప్రపంచవ్యాప్తంగా 100 మందికిపైగా క్లయింట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు దీర్ఘకాలంగా సేవలందిస్తోంది. లండన్ కేంద్రంగా 16 దేశాలలో 30 ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది. 5,000 మంది కన్సల్టెంట్స్ ద్వారా సర్వీసులు అందిస్తోంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం(2020)లో 72 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,200 కోట్లు) ఆదాయం సాధించింది. క్యాప్కోకున్న ప్రతిభావంత టీమ్, క్లయింట్లతోపాటు, సిబ్బందికి ఆహ్వానం పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు సంస్థల కలయికతో క్లయింట్లకు అత్యున్నత కన్సల్టింగ్, ట్రాన్స్ఫార్మేషన్స్ సేవలందించనున్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల మధ్య ఒకేవిధమైన బిజినెస్ మోడల్స్, కీలక మార్గదర్శక విలువలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇకపై విప్రో హోమ్ సిబ్బందిగా సేవలందించేందుకు క్యాప్కో ఉద్యోగులు గర్వపడతారని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు సంస్థల కలయిక ద్వారా క్లయింట్లకు అవసరమయ్యే అత్యున్నత ట్రాన్స్ఫార్మేషనల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లభించగలవని క్యాప్కో సీఈవో లాన్స్ లెవీ వ్యాఖ్యానించారు. -
స్కూళ్లకూ భద్రత కల్పిస్తాం
న్యూఢిల్లీ: పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సురక్షిత వాతావరణం కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లకు కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) తెలిపింది. ఈ మేరకు నవోదయ విద్యాలయ కమిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, కేంద్రీయ విద్యాలయ, డూన్ స్కూల్, స్ప్రింగ్డేల్స్, సల్వాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, సంస్కృతి మదర్స్ ఇంటర్నేషనల్, శ్రీరామ్ అండ్ అప్పీజే ఎడ్యుకేషనల్ సొసైటీ, సింధియా స్కూల్, చిత్తూరు జిల్లాలోని రిషీవ్యాలీ తదితర పాఠశాలలకు లేఖలు రాసింది. ఇటీవల గురుగ్రామ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో క్లాస్ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురైన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ ఈ మేరకు స్పందించింది. విమానాశ్రయాలు, ఐఐటీలు, ఐఐఎంలు, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, సెబీ, ఎయిమ్స్ సహా దాదాపు 200 ప్రతిష్టాత్మక సంస్థలకు భద్రత కల్పిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. ప్రైవేటు భద్రతా సంస్థలు ఒక్కో పాఠశాలలో రక్షణ ఏర్పాట్లకు రూ.20 లక్షల వరకు వసూలు చేస్తే అదే పనికి సీఐఎస్ఎఫ్ రూ.4– 4.5 లక్షలే వసూలు చేస్తుందన్నారు. తొలుత క్లయింట్‌తో ఒప్పందం ఖరారైన వెంటనే సీఐఎస్ఎఫ్కు చెందిన ప్రత్యేక నిపుణుల కమిటీ పాఠశాలను తనిఖీ చేసి 3–4 నెలల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు. స్కూళ్లలోకి వచ్చేవాళ్లను తనిఖీ చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, భద్రతా సిబ్బంది మోహరింపు, అత్యవసర ప్రతిస్పందన పరికరాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి విషయాలను ఈ నివేదికలో పొందుపరుస్తామన్నారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా తనిఖీల్లో పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలను కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. 1969లో స్థాపించిన సీఐఎస్ఎఫ్ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. -
కాగితాల్లోనే ‘సుంకిశాల’!
= సర్కారు నిర్లక్ష్యమే కీలక పథకానికి గ్రహణం =ఏడాదిగా మోక్షం కలగని కృష్ణా హెడ్‌వర్క్స్ పనులు సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడు దశల పంపింగ్‌కు కీలకమైనసుంకిశాల (నల్లగొండ జిల్లా) ఇన్‌టేక్‌వెల్ నిర్మాణం (కృష్ణా హెడ్‌వర్క్స్) పనులు ఏడాదిగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి. కృష్ణా మొదటి, రెండో దశలతో పాటు ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మూడోదశ పథకానికి అవసరమైన రావాటర్ సేకరణకు ఈ పథకమే అత్యావశ్యకమని నిపుణులు స్పష్టం చేస్తున్నా.. సర్కారు నిర్లక్ష్యం వీడట్లేదు. ఏడాది క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.840 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు అంచనాలు, డిజైన్లు సిద్ధం చేసి జలమండలి, రాష్ట్ర ప్రభుత్వానికిసమర్పించింది. నాగార్జున సాగర్ నుంచి గ్రేటర్ అవసరాలకు నీటి తరలింపునకు ఢోకా లే కుండా చూసేందుకు జలమండలి ఈ పథకానికి శ్రీకారం చుట్టిం ది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కన్నా దిగువకు నీటిమట్టం పడిపోయినపుడు నగరానికి నీటి సరఫరాపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్ నిర్మించే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్, నీటిపారుదల శాఖ కూడా ఆమోదించినా సర్కారు పైసా నిధులు విదిల్చకపోవడంతో పథకం ఫైళ్లకే పరిమితమైంది. ఇన్‌టేక్ వెల్ ఉపయోగమిదే.. ప్రస్తుతం సాగర్ నీటిపారుదల కాల్వల (ఇరిగేషన్ కెనాల్స్) నుంచి కృష్ణా మొదటి, రెండో దశ పథకాల ద్వారా కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)కు నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను పంపింగ్‌చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటిమట్టాలు 510 అడుగుల దిగువనకు పడిపోయినపుడు నగరానికి తాగునీటి సరఫరాపై తరచూ ఆందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సాగర్ నుంచి కోదండాపూర్‌కు అక్కడి నుంచి పుట్టంగండికి రావాటర్ పంపింగ్ చేస్తున్నారు. అటు నుంచి నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ వరకు రావాటర్ తరలిస్తున్నారు. తాజా ప్రాజెక్టు ద్వారా కోదండాపూర్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాల వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో భూమికి అత్యంత లోతున మూడు పెద్ద బావులు (జాక్‌వెల్స్) నిర్మిస్తారు. వాటికి 18 మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రావాటర్‌ను కోదండాపూర్‌కు పంపింగ్ చేస్తారు. ఈ నిర్మాణంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 465 అడుగులకు పడిపోయినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మూడు దశల పంపింగ్‌కు అత్యావశ్యకం ఈ ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయితే రోజు వారీగా కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్లను సుంకిశాల ఇన్‌టేక్ వెల్ వద్ద నుంచే పంపింగ్ చేసే అవకాశముంటుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.840 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తే పథకం సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆ నిధులను జైకా నుంచి సేకరించేందుకు అవసరమైన పూచీకత్తు సమర్పించినా పథకం రూపుదాల్చనుంది.