Consumer Complaint Form
-
ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: ఉత్పత్తి తయారైన దేశం గురించిన వివరాలను సరిగ్గా పేర్కొనకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ–కామర్స్ కంపెనీలకు గడిచిన ఏడాది కాలంలో 202 నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. నిర్లక్ష్యం ఇక్కడే ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉపకరణలు, దుస్తులు మొదలైన ఉత్పత్తుల విషయంలో ఇలాంటి ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన విషయంలో మొత్తం 217 నోటీసులు జారీ కాగా వీటిలో 15 నోటీసులు.. ఎక్స్పైరీ తేదీ, తయారీదారు .. దిగుమతిదారు చిరునామాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలకు సంబంధించినవి. మిగతా నోటీసులు.. ఆయా ఉత్పత్తులు ఏ దేశం నుంచి వచ్చినవో ఈ–కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాంలలో సరిగ్గా చూపకపోవడం వల్ల జారీ చేసినవి. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు జారీ చేసినది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. భారీ జరిమానా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కంపెనీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 76 కంపెనీల నుంచి రూ. 42,85,400 జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఈ దాఖిల్ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) ద్వారా వచ్చిన పలు ఫిర్యాదులను గడిచిన కొన్ని నెలల్లో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ–దాఖిల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని లీనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒక వినియోగదారుడు రూ. 127.46 మొత్తానికి సంబంధించి ఒక రెస్టారెంటుపై ఇదే విధంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్...! -
ఫర్నిచర్ కొన్నాక వెంటనే ఇవ్వకపోవడమూ నిర్లక్ష్యమే
సాక్షి, హైదరాబాద్: ఫర్నిచర్ కొన్నాక అవి పాడైనా దెబ్బతిన్నా వాటికి బదులుగా కొత్తవి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వ్యాపార సంస్థకు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కొత్త ఫర్నిచర్ ఇవ్వడానికి తీరని జాప్యం చేసిన సికింద్రాబాద్‌లోని గోద్రేజ్ అండ్ బోయ్‌సీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా జిల్లా ఫోరం విధించిన రూ.50 వేల జరిమానాను సగానికి తగ్గిస్తూ రాష్ట్ర కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుడికి ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని మాత్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కె.చంద్రశేఖర్ రూ.3.49 లక్షలను వెచ్చించి 2015లో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అందులో రూ.41 వేల విలువైన సోఫాలో కొన్నింటిని ఇవ్వలేదు. రూ.12 వేల విలువైన టీపాయ్ కూడా ఇవ్వలేదు. వాటిని గోద్రేజ్ సంస్థ నెలలోగా ఇస్తామని చెప్పి నెలల సమయాన్ని తీసుకుంది. దాంతో జిల్లా వినియోగదారుల ఫోరంలో చంద్రశేఖర్ కేసు వేశారు. రూ.5 లక్షలు పరిహారం కోరారు. దీనిపై రూ.50 వేలు పరిహారంగాను, రూ.5 వేలు ఖర్చులకు ఇవ్వాలని జిల్లా ఫోరం తీర్పు చెప్పింది. దీనిని గోద్రేజ్ సంస్థ రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసింది. 2016 మార్చిలో వినియోగదారునికి కొత్త సామాన్లు ఇచ్చామని చెప్పింది. తీవ్ర జాప్యం చేయడం, ఇ–మెయిల్స్‌కు స్పందించకపోవడాన్ని రాష్ట్ర కమిషన్ కూడా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాపారం అనైతికమని కమిషన్ అభిప్రాయపడింది. -
స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షలు.....
న్యూఢిల్లీ : సర్జరీ సమయంలో కడుపులో కత్తులు వదిలేయడం, డాక్టర్లు ఫోన్లు మర్చిపోవడం.. వంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. అది నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ నిజజీవితంలో బాధితుల ప్రాణాలు పోయేంత పని అవుతాయి. వివరాల్లోకి వెళితే ప్రసవం కోసం వెళ్తే కడుపులో స్పాంజ్‌ను ఉంచి... ఆమె ప్రాణాలపైకి తెచ్చిన డాక్టర్లు ఉన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. మహిళకు శస్త్ర చికిత్స చేసి, కడుపులో స్పాంజ్ వదిలివేసినందుకు 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్‌హోమ్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఢిల్లీలోని కైలాష్ నగర్‌కు చెందిన స్వేతా ఖండేల్వాల్ ప్రసవం కోసం 2012లో రిషబ్ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 13న శస్త్రచికిత్స చేసిన వైద్యులు శిశువును తీసి ఆమె కడుపులో స్పాంజ్‌ను వదిలేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత స్వేతా ఖండేల్వాల్కు పలుమార్లు కడుపునొప్పి రావడంతో ఆమె మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లింది. అయితే డాక్టర్లు ఆమెకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తుండటంతో మరో ఆస్పత్రిలో చేరింది. పరీక్ష చేసిన అక్కడి వైద్యుల ఇన్పెక్షన్ కారణంగా కడుపులో చీము ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి అందుకు కారణమైన స్పాంజ్ ముక్కలను బయటకు తీశారు. బాధితురాలు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దాంతో ఆమెకు కలిగించిన నష్టానికిగానూ 18 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రిషబ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.జైన్, డాక్టర్ ఉషా జైన్లను ఫోరం ఆదేశించింది.