సాక్షి, హైదరాబాద్: ఫర్నిచర్ కొన్నాక అవి పాడైనా దెబ్బతిన్నా వాటికి బదులుగా కొత్తవి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వ్యాపార సంస్థకు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కొత్త ఫర్నిచర్ ఇవ్వడానికి తీరని జాప్యం చేసిన సికింద్రాబాద్‌లోని గోద్రేజ్ అండ్ బోయ్‌సీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా జిల్లా ఫోరం విధించిన రూ.50 వేల జరిమానాను సగానికి తగ్గిస్తూ రాష్ట్ర కమిషన్ తీర్పు చెప్పింది. వినియోగదారుడికి ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని మాత్రం స్పష్టం చేసింది.
ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన కె.చంద్రశేఖర్ రూ.3.49 లక్షలను వెచ్చించి 2015లో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అందులో రూ.41 వేల విలువైన సోఫాలో కొన్నింటిని ఇవ్వలేదు. రూ.12 వేల విలువైన టీపాయ్ కూడా ఇవ్వలేదు. వాటిని గోద్రేజ్ సంస్థ నెలలోగా ఇస్తామని చెప్పి నెలల సమయాన్ని తీసుకుంది. దాంతో జిల్లా వినియోగదారుల ఫోరంలో చంద్రశేఖర్ కేసు వేశారు. రూ.5 లక్షలు పరిహారం కోరారు. దీనిపై రూ.50 వేలు పరిహారంగాను, రూ.5 వేలు ఖర్చులకు ఇవ్వాలని జిల్లా ఫోరం తీర్పు చెప్పింది. దీనిని గోద్రేజ్ సంస్థ రాష్ట్ర కమిషన్‌లో అప్పీల్ చేసింది.
2016 మార్చిలో వినియోగదారునికి కొత్త సామాన్లు ఇచ్చామని చెప్పింది. తీవ్ర జాప్యం చేయడం, ఇ–మెయిల్స్‌కు స్పందించకపోవడాన్ని రాష్ట్ర కమిషన్ కూడా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాపారం అనైతికమని కమిషన్ అభిప్రాయపడింది.
ఫర్నిచర్ కొన్నాక వెంటనే ఇవ్వకపోవడమూ నిర్లక్ష్యమే
Published Tue, May 8 2018 1:21 AM | Last Updated on Tue, May 8 2018 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment