1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్‌ పార్కు | Huge Furniture Park On 1500 Acres At SPSR Nellore District | Sakshi
Sakshi News home page

1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్‌ పార్కు

Published Fri, Sep 25 2020 7:41 AM | Last Updated on Fri, Sep 25 2020 8:04 AM

Huge Furniture Park On 1500 Acres At SPSR Nellore District - Sakshi

సాక్షి, అమరావతి: దేశీయ అవసరాలకు తోడు ఎగుమతులే లక్ష్యంగా రాష్ట్రంలో భారీ ఫర్నిచర్‌ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్‌ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్‌ పార్కు ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా ఏటా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్‌ విక్రయాలు జరుగుతుండగా ఇందులో కనీసం రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను భారత్‌ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేసింది.

ఇందులో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపైఐఐటీ) దేశవ్యాప్తంగా ఫర్నిచర్‌ తయారీకి  సంబంధించి పార్కుల ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఫర్నిచర్‌ తయారీకి అవసరమైన దుంగలు, ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పోర్టులకు దగ్గర్లో  ఫర్నిచర్‌ తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉన్నందున నెల్లూరు జిల్లాలో భారీ యూనిట్‌ ప్రతిపాదనకు డీపీఐఐటీ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. డీపీఐఐటీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు. (‘మేక్‌ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్)‌

ప్రధాన భాగస్వామిగా గోద్రేజ్‌!
రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఫర్నిచర్‌ పార్కులో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ దేశీయ ఫర్నిచర్‌ తయారీ సంస్థ గోద్రేజ్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో గుర్తించిన 20 రంగాలు ఇవే..
ఏసీలు, చర్మ పాదరక్షల తయారీ, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, ఆగ్రో క్లస్టర్, ఆహార పదార్థాలు, వ్యవసాయ కెమికల్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్, వైద్య చికిత్స ఉత్పత్తులు, టెలివిజన్, కెమెరాలు, బొమ్మలు, ఇథనాల్, ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ కాంపోనెంట్, స్పోర్ట్స్, జిమ్‌ పరికరాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement