న్యూఢిల్లీ: ఉత్పత్తి తయారైన దేశం గురించిన వివరాలను సరిగ్గా పేర్కొనకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ–కామర్స్ కంపెనీలకు గడిచిన ఏడాది కాలంలో 202 నోటీసులు పంపినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.
నిర్లక్ష్యం ఇక్కడే
ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఉపకరణలు, దుస్తులు మొదలైన ఉత్పత్తుల విషయంలో ఇలాంటి ఉల్లంఘనలు నమోదైనట్లు పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన విషయంలో మొత్తం 217 నోటీసులు జారీ కాగా వీటిలో 15 నోటీసులు.. ఎక్స్‌పైరీ తేదీ, తయారీదారు .. దిగుమతిదారు చిరునామాలను సరిగ్గా పేర్కొనకపోవడం వంటి అంశాలకు సంబంధించినవి. మిగతా నోటీసులు.. ఆయా ఉత్పత్తులు ఏ దేశం నుంచి వచ్చినవో ఈ–కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాంలలో సరిగ్గా చూపకపోవడం వల్ల జారీ చేసినవి. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు జారీ చేసినది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
భారీ జరిమానా
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో కంపెనీలు చట్టబద్ధంగా నడుచుకోవాలని, వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ తెలిపారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 76 కంపెనీల నుంచి రూ. 42,85,400 జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు.
ఈ దాఖిల్
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్) ద్వారా వచ్చిన పలు ఫిర్యాదులను గడిచిన కొన్ని నెలల్లో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ–దాఖిల్ ద్వారా ఆన్‌లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని లీనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒక వినియోగదారుడు రూ. 127.46 మొత్తానికి సంబంధించి ఒక రెస్టారెంటుపై ఇదే విధంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment