contract employees regularise
-
సంచలన నిర్ణయం.. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
భువనేశ్వర్: తన పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ నియామకాల పద్ధతిని పూర్తిగా తొలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 57వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ‘కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాల వ్యవస్థను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడానికి ఈరోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజుకు కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ నియామకాలు జరగటం లేదు. వారు ఇప్పటికీ కాంట్రాక్ట్ నియామకాల వ్యవస్థపైనే కొనసాగుతున్నారు. కానీ, ఒడిశాలో ఈ కాంట్రాక్ట్ నియామక శకం ముగిసింది. నేను ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. నోటిఫికేషన్ రేపు వస్తుంది. 57వేలకుపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రతిఏటా ప్రభుత్వంపై రూ.1300 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ముందుగానే దీపావళిని తీసుకొస్తుంది.’ అని తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్. ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా -
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో ట్విస్ట్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెలో సందిగ్ధం నెలకొంది. విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె విరమించామని ప్రకటించగా.. విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం సమ్మె కొనసాగుతుందని ప్రకటించడంతో గందరగోళం మొదలైంది. ఎందుకిలా..! మంత్రి జగదీష్‌రెడ్డితో కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ చర్చలు సఫలమయ్యాయనీ, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నామని యూనియన్ నేతలు ప్రకటించారు. కార్మికులంతా విధుల్లో చేరాలని చెప్పారు. కాగా, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తమను చర్చలకు పిలవలేదనీ, సమ్మె కొనసాగుతుందని విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. రేపు సమావేశమై సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. -
విద్యార్ధులను చావ బాదారు...ఓయూలో ఉద్రిక్తత!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. వందలాది విద్యార్ధులు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక వరకు ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం వల్ల నిరోగ్యులు ఉద్యోగాలు కోల్పోతారని తార్నాక ప్రాంతంలో విద్యార్ధులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తార్నాక చౌరస్తాలో ఆందోళన చేపట్టిన విద్యార్ధులను పోలీసులు బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్ధులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో పలువురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. తాము చేసిన ఉద్యమాల ద్వారానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఓ విద్యార్దిని అన్నారు. ఆందోళన చేపట్టిన విద్యార్ధినులపై కూడా విచక్షణారాహిత్యంగా లాఠి చార్జీ చేశారని ఓ విద్యార్ధిని మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేకూరుతుందని భావించిన తమకు అన్యాయం జరుగుతోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ నిర్ణయంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 80 వేల కాంట్రాక్టులు లబ్ది చేకూరింది.