ఫైల్ ఫోటో
విద్యార్ధులను చావ బాదారు...ఓయూలో ఉద్రిక్తత!
Published Fri, Jul 18 2014 6:24 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. వందలాది విద్యార్ధులు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక వరకు ర్యాలీ నిర్వహించి.. రాస్తారోకో చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం వల్ల నిరోగ్యులు ఉద్యోగాలు కోల్పోతారని తార్నాక ప్రాంతంలో విద్యార్ధులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తార్నాక చౌరస్తాలో ఆందోళన చేపట్టిన విద్యార్ధులను పోలీసులు బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్ధులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో పలువురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. తాము చేసిన ఉద్యమాల ద్వారానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఓ విద్యార్దిని అన్నారు. ఆందోళన చేపట్టిన విద్యార్ధినులపై కూడా విచక్షణారాహిత్యంగా లాఠి చార్జీ చేశారని ఓ విద్యార్ధిని మీడియాకు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేకూరుతుందని భావించిన తమకు అన్యాయం జరుగుతోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ నిర్ణయంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 80 వేల కాంట్రాక్టులు లబ్ది చేకూరింది.
Advertisement