స్విస్ చాలెంజ్, బస్తీమే సవాల్
ఆ బ్యాంకులలో నల్లధనం ఎంత గుప్తమో, స్విస్ చాలెంజ్ విధానం కూడా అంతే గోప్యంగా ఉంటుంది. తాటస్థ్యం ముసుగులో దేశాల మధ్య పచార్లు కొడుతూ ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణం పేరుతో ప్రజా ప్రయోజనాలను విధ్వంసం చేస్తుంది. కాంట్రాక్ట్ పెట్టుబడుల పేరిట తన లాభాలతో అందుకు తోడ్పడే పాలక వర్గాల ప్రయోజనాలకు నిండారా తోడ్పడుతుంది. స్విస్ చాలెంజ్ మౌలిక రహస్యాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా వివరించాలంటే, అదొక బ్రోకరేజీ పద్ధతి.
‘ఆంధ్రప్రదేశ్ రాజధాని (అమరావతి) నిర్మాణం పేరిట, రాజధాని అభి వృద్ధికి భాగస్వామ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడి పడి ఉన్న ఈ కామాటంలో విదేశీ కంపెనీల కోసం కాకుండా, ప్రజా ప్రయోజ నాల రక్షణ కోసమే నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు హితవు పలికింది. ప్రతి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని న్యాయస్థానం ప్రశ్నిం చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివరాలను బయటపెట్టకపోవడంలోని లోగుట్టు ఏమిటని నిలదీసింది. స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.’ (సింగపూర్ ప్రైవేటు కంపెనీల కన్సార్టియం సంస్థ ప్రతిపాదనల మీద హైకోర్టు స్టే ఉత్తర్వులు విధించిన సందర్భంగా పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం)
చినికిచినికి గాలివానగా మారిన సింగపూర్ కంపెనీల సంయుక్త సంస్థ (కన్సార్టియం) ప్రతిపాదనలకు మూలం ఏమిటి? ఆ సంస్థ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎక్కడ నుంచి అరువు తెచ్చుకున్నది? ఇవి ముందు తెలుసుకుంటేనే గానీ కొందరి పాలకులకు ‘బస్తీమే సవాల్’ అంటూ తొడగొడుతున్న ఈ స్విస్ చాలెంజ్ అవతరించిన విధానం తెలియదు. ఆశ్చర్యపడవద్దు గానీ, ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు రాని ఈ స్విస్ చాలెంజ్ రెండు ప్రపంచ యుద్ధాల క్రమంలో స్విట్జర్లాండ్ జాతీయ విధానంగా అవతరించింది. భారత బడా సంపన్నుల రూ. 24 లక్షల కోట్ల అక్రమ సంపాదనకు (బ్లాక్‌మనీ) ఆదర్శగూడుగా అలరారుతున్న స్విస్ బ్యాంకుల నిర్వహణ పంథాలోనే ఈ చాలెంజ్ కూడా రూపుదిద్దుకుందని ప్రసిద్ధ విశ్లేషకుడు వినాయక్ చటర్జీ వెల్లడించారు.
ఇదొక బ్రోకరేజీ విధానం
ఈ పదబంధం ఏ గుప్త సంస్థలో బాలసారె జరుపుకుందో, దీనిని ప్రపంచం మీదకు వదిలిపెట్టినవాడు ఎవరో ఇప్పుడు తెలియకపోవచ్చుగానీ స్విట్జ ర్లాండ్ విదేశాంగ విధానం, జోక్యం చేసుకునే తత్వానికి దూరంగా ఉన్నట్టు కనిపించే దాని తాటస్థ్యం బూటకమని మాత్రం అర్థమవుతుంది. ఆ బ్యాంకు లలో నల్లధనం ఎంత గుప్తమో, స్విస్ చాలెంజ్ విధానం కూడా అంతే గోప్యంగా ఉంటుంది. తాటస్థ్యం ముసుగులో దేశాల మధ్య పచార్లు కొడుతూ ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణం పేరుతో ప్రజా ప్రయోజనాలను విధ్వంసం చేస్తుంది. కాంట్రాక్ట్ పెట్టుబడుల పేరిట తన లాభాలతో అందుకు తోడ్పడే పాలక వర్గాల ప్రయోజనాలకు నిండారా తోడ్పడుతుంది. స్విస్ చాలెంజ్ మౌలిక రహస్యాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా వివరించాలంటే, అదొక బ్రోకరేజీ పద్ధతి. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కొండలలో పోడు సేద్యం ద్వారా సరుకుల్ని ఉత్పత్తి చేసుకుంటే మార్కెట్ చేసి పెట్టే నాథుడు లేక బ్రోకర్లకు శేరుకు శేరున్నర దోచిపెట్టి సంతలకు చేర్చుకునే దోపిడీ పద్ధతికి మించిన దోపిడీ ఈ చాలెంజ్‌లో ఉంది.
ఇందులోనే ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఖరారు చేసే కాంట్రాక్ట్ పద్ధతి ఒకటి ఉంది. నర్మగర్భంగా తమకు అనుకూలమైన ఒక ప్రైవేటు కంపెనీ చేత పనుల కోసం కాంట్రాక్టుకు వేసే బిడ్డింగ్ (వేలం)లో తక్కువ కొటేషన్ వేయించి, అదే పనికి పోటీదారులను పెంచేటట్టు చేయడం, తద్వారా ముందే నిర్ణయించిన అనుకూల కాంట్రాక్టరు ఈ పోటీకి తట్టుకోలేక కాంట్రాక్టును వదులుకునేటట్టు నాటకమాడి, తనకు అనుకూలంగా ప్రభుత్వ కాంట్రాక్టు పొందడం. ‘నీవు ఎంత లాభం పట్టగలవో పట్టుకో, నా వాటా మాత్రం నాకు వదిలెయ్!’ - ఇదీ స్థూలంగా స్విస్ చాలెంజ్. ఇదంతా మౌలిక వసతుల కల్పన పేరుతోనే జరుగుతుంది. ఇందులో ఉన్న మతలబుని, దోపిడీ రహస్యాన్ని కోర్టు పసికట్టింది కాబట్టే, సింగపూర్ కన్సార్టియంకు చేసిన ప్రతిపాదనలలోని ఆదాయ రహస్యాలను వెల్లడించాలని ఆదేశిం చవలసి వచ్చింది. ఎందుకు? ఆ రహస్యాల ఖరీదు రూ. 50 వేల కోట్లు అని చెబుతారు. రాజధాని నిర్మాణం కోసమంటూ వేల ఎకరాల భూసమీకరణ, వేలాదిమంది రైతుల పంట భూములలోని పండ్ల తోటలను అర్ధరాత్రి తగల పెట్టించడం ప్రజలు కూడా గమనించారు.
సింగపూర్ సంస్థ కన్సార్టియంతో పాలకులు కుదుర్చుకున్న అవగాహన పత్రం ప్రకారం ఆ సంస్థలకు కేటా యించిన 250 ఎకరాలలో తీసే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇచ్చేదిలేదు పొమ్మని కన్సార్టియం తేల్చి చెప్పినందుకే స్విస్ చాలెంజ్ పద్ధతి ప్రశ్నార్థక మైంది. అందుకే పారదర్శకత లేని లోపాయికారీ పద్ధతి వేలంలో పోటీదారు లైన ఇతర బిడ్డర్లకు నష్టదాయకమని వినాయక్ చటర్జీ ‘బిజినెస్ స్టాండర్డ్’లో పేర్కొనవలసి వచ్చింది. అంటే ఈ లోపాయికారీ పద్ధతివల్ల ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పారదర్శకమైన సేకరణను నియంత్రించే శక్తిగా ప్రైవేట్ సింగపూర్ కంపెనీల కన్సార్టియం అవతరిస్తుంది. మరోమాటలో చెప్పా లంటే- కీలకమైన నిర్మాణ రంగంలో కేవలం ప్రైవేట్ రంగానికి లాభించే పద్ధతిలో మాత్రమే వేలం పద్ధతిని పూర్తిగా నియంత్రించే సరికొత్త వేలం (బిడ్డింగ్) పద్ధతే ‘స్విస్ చాలెంజ్’ విధానమని మరచిపోరాదు.
విదేశాల అనుభవం
ఈ పద్ధతిలో ఎదురు చాలెంజ్ విసిరే ఇతర కీలకమైన కంపెనీలు తమ పోటీ ప్రతిపాదనలతో ముందుకు రావడానికి, 60 రోజుల లోపుగానే ప్రత్యా మ్నాయ ప్రతిపాదనలు సమర్పించాలని ‘స్విస్’ పద్ధతి విధించే షరతులు అధిగమించలేని, మింగలేని ‘పచ్చి వెలక్కాయ’. ఈ స్విస్ చాలెంజ్ విధానం వల్ల చిలీ, దక్షిణాఫ్రికా, కొరియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు ప్రయోజనం పొందింది లేదు. ఈ ‘స్విస్’ విధానాన్ని తలకెత్తుకుని తెచ్చుకున్న తల నొప్పివల్ల స్విస్ పద్ధతికి, నిర్మాణ రంగంలో అత్యంత శక్తివంతమైన దేశీయ నిపుణులు, నైపుణ్యం మూర్తీభవించిన కంపెనీలు సహితం పోటీ ప్రతిపాద నలతో ముందుకు రావడానికి నిర్మాణ అంచనాల రూపకల్పనకు ‘60 రోజుల వ్యవధి’ చాలదన్నందుకు బిడ్డింగ్ నుంచి తప్పించేశారు.
మనీలా (ఫిలిప్పైన్స్ రాజధాని)లోని ‘‘నీనాయ్ ఏక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’’ నిర్మాణ బాగోతమే ఇందుకు నిదర్శనం. అది అనేక వివాదాలకు దారితీసిన సంగతిని మరచిపోరాదు. అంతేకాదు, ఈ ‘స్విస్ చాలెంజ్’ నర్మగర్భ నిర్మాణ పద్ధతు లకు, ప్రైవేట్ కంపెనీలు, ప్రాజెక్టుల మౌలిక నిర్మాణ పద్ధతులకు ‘పిలవని పేరంటం’లాగా ఆయాచితంగానే పరిష్కార మార్గాలకు, ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు ప్రపంచ బ్యాంక్ ముఖద్వారంగా వ్యవహరిస్తోందని కూడా గుర్తించవలసిన అవసరం ఉందని మరవొద్దు.
‘పబ్లిక్-ప్రైవేట్ ప్రాజెక్టుల’ అవినీతికర వ్యవస్థను ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిలో వత్తాసు ఇచ్చి ముందుకు నెట్టింది కూడా అమెరికా ఆధ్వర్యంలోని ఈ వరల్డ్ బ్యాంకేనని కూడా మరవరాదు. ఎంతోమంది దేశీయ నిపుణుల్ని, నిర్మాణ రంగాల్లో కాల నియమం తప్పకుండా ప్రాజెక్టులను పూర్తిగావించిన దేశ, విదేశాల్లో పేరు గడించిన మహా ఇంజనీర్లు, దక్షతగల దేశీయ నిపు ణులూ, అపారమైన కార్మిక శక్తీ ఉందని ఇప్పటికైనా మన పాలకులు, దీనిని స్వాగతించదలచినవారు గుర్తించాలి.
కేల్కర్ కమిటీ ఏం చెప్పింది?
నిర్మాణ రంగంలో పనులకు అవసరమైన సంబారాలను సమకూర్చడంలో స్విస్ పద్ధతివల్ల పారదర్శకత కుదరదని ఆచరణలో ఈ పద్ధతిని అనుసరిం చిన కొన్ని దేశాల అనుభవం. పైగా తగాదాలు వస్తే ఏ లండన్ కోర్టుకో వచ్చి పరిష్కరించుకోవలసిందిగా మనకు ఎదురు సవాలు విసిరేదే ‘స్విస్ చాలెంజ్’ అనీ మరవరాదు. బహుశా అందుకే, నిర్మాణ రంగాల ‘అభివృద్ధి’ పేరిట నిర్మించే ప్రాజెక్టులకు నిధులు సేకరించేందుకు అనుసరించే స్విస్ చాలెంజ్ పద్ధతుల్ని పరిశీలించిన పిమ్మటనే కేంద్ర ప్రభుత్వం కేల్కర్ నాయకత్వాన ఏర్పరచిన నిపుణుల కమిటీ ఈ చాలెంజ్‌కి వ్యతిరేకంగా తీర్పు వెలువ రించింది.
వరల్డ్ బ్యాంక్ సంస్కరణలలో భాగమే
‘మొత్తాలు చూసి పేటలు’ పరిచే కొత్తరకం కాంట్రాక్టుల వ్యవస్థకు తెరలేపింది ఈ ‘చాలెంజ్’. మన దేశంలోకి ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా దిగుమతి అయిన ఈ ‘చాలెంజ్’ పద్ధతినే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా తదితర రంగాలలో కేంద్రమూ అనుసరించి చేతులు కాల్చుకుంటున్నాయి. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వాలు కొన్ని దేశ సహజ వనరులను ప్రైవేట్- ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) పేరిట కొల్లగొడుతున్నాయి. అనేక సంద ర్భాల్లో కల్పించే విపరీత రాయితీల పర్యవసానంగా అనేక రకాల రాజకీయ, లీగల్ వివాదాలూ తలెత్తుతున్నాయి.
ఇందుకు ఉదాహరణలు-కామన్వెల్త్ క్రీడలు, రేడియో తరంగాలపై కంపెనీల గుత్తాధిపత్యం, కృష్ణా-గోదావరి బేసిన్ వనరుల దోపిడీ విషయంలో బొగ్గు తవ్వకాల విషయంలో బయ ల్పడిన అనేక కుంభకోణాలు, చివరికి కేంద్ర నిఘా కమిషన్ విజయ్ కేల్కర్ కమిటీలు సహితం ‘‘స్విస్ చాలెంజ్’’ విధానం బిడ్డింగ్ నడిపే పద్ధతులు పారదర్శకంగా లేవని ఇంతకుముందే హెచ్చరించాయని గుర్తు పెట్టుకోవాలి. ప్రజా వ్యతిరేక సంస్కరణలంటే పాలకులు ఆరాటపడుతూండటం ఈ రక మైన లావాదేవీల కోసమే.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in