దేశాభివృద్ధికి పాటుపడే పార్టీలకు మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ, దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీతో పొత్తు విషయమై అడిగిన ప్రశ్నకుఆయన పైవిధంగా బదులిచ్చారు. పొత్తులపై మాట్లాడడానికి ఇప్పుడు సమ యం కాదంటూనే బీజేపీ పేరు చెప్పకుండా అవి నీతిని వ్యతిరేకిస్తూ, దేశాన్ని, రాష్ట్రాలను అభివృద్ధి చేసే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. వామపక్షాలతో కలుస్తారా? అని అడగ్గా.. ఆ విషయాలను తర్వాత మాట్లాడదామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, సహా టీడీపీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అడిగినప్పుడు.. అవన్నీ ఆరోపణలేనని, ఒక్కటి కూడా రుజువుకాలేదని బదులిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు సంతృప్తికరంగా లేదని, 10 అంశాలను కలపాలని కోరుతామన్నారు. ప్రత్యేక సమావేశం, లేదా ఓటాన్ అకౌంట్లో తెలంగాణ బిల్లు వస్తుందని, తాము ఓటు వేస్తూనే, సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలని పట్టుపడతామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టిందని, ఇప్పుడు అవినీతిపై ప్రధాని నీతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై తాము ప్రధానికి స్వయంగా పుస్తకాలు అందించినా ఎలాంటి చర్య లు తీసుకోలేదన్నారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు. అన్ని విషయాల్లో ప్రధాని విఫలమై గద్దె దిగేముందు రాహుల్ కోసం యువతకు సందేశం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభలో ప్రజా సమస్యలపై ప్రధాని మన్మోహన్, రాహుల్ ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించారని, 2014లో దేశం నుంచే పారద్రోలుతారన్నారు.