contributory pension
-
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మొండి వైఖరి వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తోందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావా లని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శనివారం ఇందిరాపార్కు వద్ద ఎస్టీయూ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమస్యలు లేనప్పుడే ప్రశాంతంగా పనిచేస్తారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు బ్రహ్మచారి, బాలకృష్ణయ్య, ఎ.లక్ష్మణ్,33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
ప్రత్తిపాడు : కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని(సీపీఎస్) రద్దు చేసి, పాత పద్ధతినే (ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్తిపాడులోని ఆర్సీఎం పాఠశాల ఆవరణలో గురువారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీటీఎఫ్ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఉపాధ్యాయులకు పెన్షన్ వస్తోందన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచీకరణ విధానంలో భాగంగా సీపీఎస్‌ను తీసుకువచ్చాయని ధ్వజమెత్తారు. సీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని, అందరూ వ్యతిరేకించాలని తెలిపారు. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వ్యతిరేకమైన సామాజిక భద్రత లేని ఈపథకాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుటకు అందరూ ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యను దూరం చేసి, ఉపాధ్యాయులకు పని భారంగా మార నున్న ఈ విధానాన్ని తిరస్కరించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోరస దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ అప్ లోడింగ్, జంబ్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించాలని కోరారు. ఈసభలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రాజు, జిల్లా కార్యదర్శి బి.సత్యప్రసాద్, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు ఫిలిప్‌రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాయవరం, ప్రత్తిపాడు యూనిట్ కార్యదర్శులు కె.రామచంద్రం, నల్లబిల్లి శ్రీనివాస్, ఏలేశ్వరం, జగ్గంపేట యూనిట్ అధ్యక్షులు బొడ్డేటి సురేష్, వెన్నా శ్రీను, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం డివిజన్ల కార్యదర్శులు సిరాజ్, మాధవరపు శ్రీరామమూర్తి, జిల్లేళ్ల మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేయాలి
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ విద్యారణ్యపురి : ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టపరిచే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు పరిచి పాత పెన్షన్ పథకాన్నే వర్తింప చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) జిల్లాశాఖ ఆధ్వర్యంలోఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఏకశిల పార్కువరకు ర్యాలీ నిర్వహిచారు. అనంతరం ఏకశిల పార్కు వద్ద జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒకేరీతిగా వ్యవహరించారని అందులో భాగంగానే సీపీఎస్ పథకంను తీసుకొచ్చారన్నారు. ఇటీవల రిటైర్డ్ అయిన మృతి చెందిన సీపీఎస్ ఉద్యోగులకు నామమాత్ర పెన్షన్ కూడా రావడం లేదన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి మాట్లాడుతూ పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి పెన్షన్ నిధులు ప్రైవేటుపరం కాకుండా చూడాలన్నారు. ర్యాలీలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీనియర్ నాయకులు కె రంజిత్‌కుమార్, కార్యదర్శులు సీహెచ్.రవీందర్‌రాజు, ఆర్.వాసుదేవరెడ్డి, పెండెం రాజు, ఎ.రాజారాం, ఎన్.శ్రీనివాస్, డి.కిరణ్‌కుమార్, లింగారావు, రాజేంద్రప్రసాద్, కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
► ఎపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్: ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంతకల్లు, గుత్తి పట్టణాల్లో గురువారం ఆయన పర్యటించారు. కళాశాలలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపక, ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మిక సిబ్బందిని కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ అనుబంధ జీఓలను అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డు సౌకర్యం ఉన్న ఉద్యోగ, కార్మికులందరికీ క్యాస్‌లెస్ కార్పొరేట్ వైద్యం అందజేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ రెడ్డి, జిల్లా కన్వీనర్ ఓబులరావు, రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు ఆయన వెంట ఉన్నారు.