కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
Published Thu, Sep 22 2016 11:00 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
ప్రత్తిపాడు :
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని(సీపీఎస్) రద్దు చేసి, పాత పద్ధతినే (ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్తిపాడులోని ఆర్‌సీఎం పాఠశాల ఆవరణలో గురువారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీటీఎఫ్ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఉపాధ్యాయులకు పెన్షన్ వస్తోందన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచీకరణ విధానంలో భాగంగా సీపీఎస్‌ను తీసుకువచ్చాయని ధ్వజమెత్తారు. సీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని, అందరూ వ్యతిరేకించాలని తెలిపారు. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వ్యతిరేకమైన సామాజిక భద్రత లేని ఈపథకాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుటకు అందరూ ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యను దూరం చేసి, ఉపాధ్యాయులకు పని భారంగా మార నున్న ఈ విధానాన్ని తిరస్కరించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గోరస దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ అప్ లోడింగ్, జంబ్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించాలని కోరారు. ఈసభలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రాజు, జిల్లా కార్యదర్శి బి.సత్యప్రసాద్, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు ఫిలిప్‌రాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాయవరం, ప్రత్తిపాడు యూనిట్ కార్యదర్శులు కె.రామచంద్రం, నల్లబిల్లి శ్రీనివాస్, ఏలేశ్వరం, జగ్గంపేట యూనిట్ అధ్యక్షులు బొడ్డేటి సురేష్, వెన్నా శ్రీను, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం డివిజన్ల కార్యదర్శులు సిరాజ్, మాధవరపు శ్రీరామమూర్తి, జిల్లేళ్ల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement