controversy on award
-
మరో వివాదంలో మంత్రి అఖిలప్రియ
సాక్షి, అమరావతి : ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివారంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని అమరావతిలో సోషల్ మీడియా సమ్మిట్-2017 జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, టాలీవుడ్ హీరో రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, షార్ట్ ఫిల్మ్ హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్కడే సమస్య మొదలైంది. ఏపీ నిర్వహించిన కార్యక్రమం కాబట్టి టాలీవుడ్ నటులకు ఇవ్వాలికానీ, బాలీవుడ్ నటికి ఎలా ఇస్తారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయంపై నెటిజన్లు సైతం ఘాటుగానే విమర్శిస్తున్నారు. తాజాగా దీపిక నటించిన పద్మావతి సినిమా వివాదాల్లో ఉంది. అలాంటిది ప్రత్యేకంగా దీపికకు అవార్డు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో దీపిక స్థాయిలో ఎవరూ కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నంది అవార్డుల వివాదంలో సతమతమౌతున్న ప్రభుత్వానికి, మంత్రి అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. -
అవార్డులపై మూర్తిగారి ఆవేదన
సాక్షి, హైదరాబాద్ : గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేవారు. కానీ, ఇప్పుడు అవార్డులంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయి అని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా నంది అవార్డులు-విమర్శలపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. చారిత్రక నేపథ్యంల, కుటుంబ చిత్రాలను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా, వినోదపరంగా బాహుబలి చిత్రం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిందన్న ఆయన... అందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. కానీ, ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందని నారాయణమూర్తి తెలిపారు. -
నా జాతీయ అవార్డు వెనక్కి తీసేసుకోండి
రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అయితే దాని గురించి ఒక్కోరూ ఒక్కోలా మాట్లాడుతుండటంతో అక్షయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. 'మీరు కావాలనుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకోండి' అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. 'గత పాతికేళ్లుగా నేను వింటూనే ఉన్నాను. ఎప్పుడైనా ఎవరికైనా అవార్డు వచ్చిందంటే దానిమీద బోలెడంత చర్చ మొదలుపెడతారు. ఎవరో ఒకరు ఏదో రకంగా వివాదం సృష్టిస్తారు. ఆ అవార్డు అతడికి వచ్చి ఉండకూడదు.. వేరేవాళ్లకు రావాల్సింది అంటారు. నాకు 26 ఏళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఇది కూడా మీకు నచ్చకపోతే వెనక్కి తిరిగి తీసేసుకోండి' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. రుస్తుం సినిమాలో నటనకు గాను అక్షయ్‌కుమార్ ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై చాలామంది కామెంట్లు చేశారు. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్, అలీగఢ్ సినిమాలో మనో్జ్ బాజ్‌పాయి లాంటి వాళ్ల కంటే అక్షయ్ ఏమంత గొప్పగా చేశాడంటూ విమర్శించారు. ఇంతకుముందు అక్షయ్ నటించిన హేరా ఫేపరీ, భాగమ్ భాగ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ ఇప్పుడు జాతీయ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా ఉండటం వల్లే అక్షయ్‌కి అవార్డు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఇంతకుముందు రమేష్ సిప్పీ చైర్మన్‌గా ఉండగా అమితాబ్ బచ్చన్‌కు అవార్డు వచ్చిందని, అలాగే ప్రకాష్ ఝా చైర్మన్‌గా ఉండగా అజయ్ దేవ్‌గణ్‌కు వచ్చిందని, అప్పుడెవరూ ప్రశ్నించరు గానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయని అక్షయ్ కుమార్ మండిపడ్డాడు. వాస్తవానికి అక్కీకి ఈ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నాడు. అతడు చాలా టాలెంట్ ఉన్న, కష్టపడే, నిబద్ధత కలిగిన నటుడని.. ఇప్పటికైనా అతడిని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ అర్హత అక్షయ్‌కి ఉందని చెప్పాడు. తన భార్య ప్రేమికుడిని హత్యచేసి విచారణ ఎదుర్కొన్న నౌకాదళ అధికారిగా రుస్తుం సినిమాలో అక్షయ్ నటించాడు. ప్రస్తుతం తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటిస్తున్న పద్మన్, రజనీకాంత్ హీరోగా చేస్తున్న రోబో 2.0 సినిమాలలో అక్షయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.