కదిలిన సమైక్య దండు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్వచ్ఛందంగా తరలివెళ్లిన వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల పార్టీ నాయకులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న సభకు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రజలు మద్దతిస్తుండటం విశేషం. వర్షం మరింత అధికమైనా సభను విజయవంతం చేసి తీరుతామని సమైక్యవాదులు భీష్మించారు.
జిల్లా వ్యాప్తంగా 11 ఆర్టీసీ డిపోల నుంచి 280 బస్సులు, 1602 క్రూజర్లు, జీపులు, సుమోలతో పాటు 101 ప్రైవేట్ బస్సుల్లో ప్రజలు శంఖారావానికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి కర్నూలు, కోడుమూరు నియోజక వర్గాలకు సంబంధించిన 10వేల మంది సమైక్యవాదులకు పార్టీ ఆధ్వర్యంలో భోజనాలు సిద్ధం చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలు రాత్రి భోజనాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. ఇదిలాఉండగా గుంతకల్లు నుంచి ఆదోని, మంత్రాలయం మీదుగా హైదరాబాద్ చేరుకునేందుకు సమైక్యవాదులు 18 బోగీలు కలిగిన రైలును రిజర్వు చేసుకున్నారు. డోన్, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లల్లోనూ ప్రజలు భారీగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లోనే బయలుదేరారు.
సభకు బయలుదేరే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కాటసాని రామిరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ తదితర నాయకులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల జిల్లా కన్వీనర్లు, మండల కన్వీనర్లు ముమ్మర ఏర్పాట్లు చేశారు.