'విభజనతో మూడు ప్రాంతాలకు నష్టం'
కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తుందని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ కిషోర్ బుధవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విభజన వల్ల ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జంతర్‌మంతర్ వద్ద న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఆయన తన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థి జేఏసీ క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇటీవలే ఆ విద్యార్థి జేఏసీ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే.