హిందుత్వం: ముస్లిం లాయర్ అనూహ్య చర్య
పట్నా: బిహార్‌లో ఓ ముస్లిం లాయర్ అనూహ్యరీతిలో హిందూమతంలోకి మారారు. ఇరుగుపొరుగున ఉన్న ముస్లింలు వేధిస్తున్నారంటూ 46 ఏళ్ల మహమ్మద్ అన్వర్ వేదమంత్రోచ్ఛారణ నడుమ మంగళవారం హిందూమతంలోకి మారారు. ఆయనతోపాటు ఆయన కొడుకులు- మహమ్మద్ ఆమిర్ (11), మహమ్మద్ షబీర్ (9) కూడా హిందూమతంలోకి వచ్చారు. అన్వర్ తన పేరును ఆనంద్ భారతిగా మార్చుకోగా, ఆయన కొడుకులు అమన్ భారతి, సుమన్ భారతిగా పేరు మార్చుకున్నారు. తన భార్య షబ్నం కూడా త్వరలోనే హిందూమతంలోకి మారనున్నట్టు ఆనంద్ తెలిపారు.
’బేగుసరాయి జిల్లాలోని పొఖారియా ప్రాంతంలో నేను 18 ఏళ్లుగా నివసిస్తున్నాను. ముస్లిం ప్రాబల్యప్రాంతమైన ఇక్కడ 12 ముస్లింల ఇళ్ల మధ్య మేం ఉంటున్నాం. స్థానికంగా ఇస్లాం కాంట్రాక్టర్‌గా చెప్పుకొనే సయెద్ కుటుంబం నన్ను గత ఏడు నెలలుగా వేధిస్తోంది. నేను నమాజ్ ఎక్కువగా చేయనని, నా ఇంటిముందు ఎముకలు విసిరి వేధింపులకు గురిచేస్తున్నారు’ అని ఆనంద్ వివరించారు. ’నన్ను నేను మానవతావాదిగా భావిస్తాను. ఆలయాల నిర్మాణాలకు నేను విరాళాలు ఇచ్చాను. ఇలా చేయడం ఇరుగుపొరుగున ఉన్న ముస్లింలకు నచ్చలేదు. నువ్వు బీఫ్ ఎందుకు తినవు? నీ పిల్లలను మదర్సాకు ఎందుకు పంపవంటూ నన్ను అడిగేవారు’ అని చెప్పారు.
ఇస్లాం మౌలిక నిబంధనలను పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని తనను 40మంది ముస్లింలు హెచ్చరించారని, అందుకే తాను మతం మారానంటూ తెలిపారు. 46 ఏళ్ల వయస్సున్న తాను సొంత విచక్షణతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, దీని వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పారు. ఆయన ప్రాణాలకు రక్షణగా ఉంటామని హామీ ఇవ్వడంతో ఆయన ఇస్లాంను విడనాడరని బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శుభం భరద్వాజ్ తెలిపారు.